Faria Abdullah
Faria Abdullah| ఆకేరు న్యూస్, సినిమా: సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ సిగ్మా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫారియా మీడియాతో ముచ్చటించారు.
తొలిసారి తమిళ్లో..
సిగ్మా తన తొలి తమిళ సినిమా అని ఫారియా తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ వంటి ప్రముఖ సంస్థలో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో తాను రేడియో జాకీ పాత్రలో కనిపిస్తానని, ఇప్పటివరకు చేయని విధంగా భిన్నమైన క్యారెక్టర్ చేశానని చెప్పారు. సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలను చూపించే అవకాశం లభించిందని, కుటుంబం అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందని పేర్కొన్నారు.
యాక్షన్ సినిమాలంటే ఇష్టం
తన పర్సనాలిటీకి యాక్షన్ పాత్రలు కూడా బాగా సరిపోతాయని ఫారియా చెప్పారు. అన్ని రకాల సినిమాలు చేయాలని ఉందని, యాక్షన్ చిత్రాల్లో నటించడం కూడా తనకు ఇష్టమేనన్నారు.
సందీప్‌తో కెమిస్ట్రీ కొత్తగా ఉంటుంది
సందీప్ కిషన్ తనకు ఎప్పటినుంచో తెలుసని, ఇద్దరూ కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా అనుకున్నామని ఫారియా తెలిపారు. చివరకు సిగ్మాతో ఆ అవకాశం వచ్చిందన్నారు. ఈ సినిమాలో తమ ఇద్దరి పాత్రల్లో చాలా కొత్తదనం ఉంటుందని చెప్పారు.
జేసన్‌పై ప్రశంసలు
జేసన్ సంజయ్ జూమ్ కాల్లో కథ చెప్పారని ఫారియా గుర్తుచేసుకున్నారు. కథ విన్న తర్వాత ఆయన వయసెంత అని అడిగితే 24 ఏళ్లు అని చెప్పారని, అది తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. తొలి సినిమానే అయినప్పటికీ జేసన్‌కు దర్శకత్వంపై మంచి కమాండ్, స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు. సెట్‌ను చాలా కూల్‌గా హ్యాండిల్ చేశారని చెప్పారు.
రాజమౌళి ఫీడ్‌బ్యాక్
సిగ్మా ట్రైలర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్లా ఉందని ఆయన చెప్పినట్లు ఫారియా తెలిపారు. షూటింగ్ సమయంలో చిత్రబృందం చాలా ఎంజాయ్ చేసిందని చెప్పారు. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తే సిగ్మా 2 కూడా చేయాలని ఉందని, అయితే ప్రస్తుత కథ ఇక్కడితో ముగుస్తుందని తెలిపారు.
తమన్ బీజీఎం నెక్స్ట్ లెవెల్
సినిమాకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫారియా అన్నారు. ఆయన సిగ్నేచర్ మ్యూజిక్ సినిమాలో కనిపిస్తుందని చెప్పారు. చివర్లో వచ్చే సిగ్మా స్టైల్ పాటను చాలా ఎంజాయ్ చేస్తూ చేశానని తెలిపారు.
దర్శకత్వంపై ఆసక్తి
భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఉందని ఫారియా వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని కథలు రాస్తున్నానని, అయితే దర్శకురాలిగా మారడానికి ఇంకా సమయం ఉందన్నారు. తాను దర్శకత్వం వహిస్తే సినిమాలో తానే నటిస్తానని చెప్పారు. తమిళంలో కొన్ని కొత్త కథలు విన్నానని, సిగ్మా విడుదలైన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటానని ఫారియా తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
