రాపర్తి సోమయ్య
* రాపర్తి సోమయ్య
ఆకేరు న్యూస్, పాలకుర్తి: వ్యవసాయ రంగ పరిరక్షణతో పాటు రైతులు, కార్మికుల హక్కుల సాధన కోసం శ్రామిక ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు. రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులకు బలిచేసే ప్రభుత్వ విధానాలను ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని ఆయన అన్నారు.
బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షురాలు బచ్చు శ్రీలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాపర్తి సోమయ్య మాట్లాడారు.
జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 15న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. గతంలో ఢిల్లీలో జరిగిన చారిత్రక రైతు ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు.
రైతుల ప్రధాన డిమాండ్లు
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు సీ2+50 శాతం ప్రకారం కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేయడంతో పాటు, తదుపరి పంట సాగుకు సున్నా వడ్డీతో రుణాలు అందించాలని కోరారు.
విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ దేశీయ రైతులకు నష్టం కలిగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అన్నారు. సాదా బైనామా భూములకు బేషరతుగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని, కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు అందించాలని కోరారు. కరువు పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల నాయకుల హాజరు
ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్యాల సోమన్న, ఉపాధ్యక్షుడు సోమ సత్యం, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదార్, ఏవోఐ (LIC) రాష్ట్ర నాయకుడు సోమ అశోక్ బాబు, రైతు సంఘం మండల కార్యదర్శి బెల్లి సంపత్, కేవీపీఎస్ జిల్లా నాయకుడు కాకర్ల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు కాకర్ల పద్మ, కాకర్ల బాబు, సీఐటీయూ నాయకుడు మాసంపల్లి నాగయ్య, రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు ముస్కు ఇంద్రారెడ్డి, అనపర్తి శోభన్, కే. రేణుక, ఎల్లమ్మ, చంద్రయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

