ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
* రూ.4.92 కోట్లతో రోడ్డు విస్తరణ
* ఆధునీకరణ పనులు ప్రారంభం
ఆకేరు న్యూస్, తొర్రూరు: పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండల ప్రజలకు కీలకమైన రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తొర్రూరు పట్టణం నుంచి కంటాయపాలెం వరకు ఉన్న ప్రధాన రహదారి విస్తరణ, ఆధునీకరణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4.92 కోట్ల నిధులతో ఈ పనులను చేపట్టనున్నారు.
ప్రయాణికులకు ఊరట
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొర్రూరు నుంచి కంటాయపాలెం వరకు రాకపోకలు సాగించే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఈ రహదారి ఎంతో కీలకమని తెలిపారు. గతంలో ఈ మార్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.
ప్రారంభించిన పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
మౌలిక వసతులపై దృష్టి
పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు యశస్విని రెడ్డి తెలిపారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
రూ.4.92 కోట్లతో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులపై తొర్రూరు, కంటాయపాలెం ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

