
* అంటువ్యాధి కాదంటున్న వైద్యాధికారులు
* తురకపాలెం ఘటన మరువముందే పల్నాడులో..
* దావుపల్లి తండాలో ఓ వ్యక్తికి సోకిన వ్యాధి
* మంగళగిరిలో చికిత్స పొందుతున్న బాధితుడు
* అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రాణాంతకమైన వ్యాధి ప్రబలుతుందేమో అనే భయం నేడు ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొంది. వెల్దుర్తి మండలం వజ్రాలపాడు పంచాయతీ పరిధిలోని దావుపల్లి తండాలో ఓ వ్యక్తికి మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలు కన్పించడంతో అధికారులు అతడిని మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు మంగళగిరిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారి రవి ఇతర అధికారుల గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా ఎవరైనా వ్యాధి బారిన పడ్డారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. వాడవాడలా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తురకపాలం ఘటన మరువకమందే…
ఇటీవలే గుంటూరు జిల్లా తురకపాలెంలో ఈ వ్యాధి విజృంభించింది. గ్రామంలో మెలియాయిడోసిస్ వ్యాధి తో 28 మంది చనిపోయిన విషయం తెల్సిందే.చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల్లో ఎక్కువమంది పేదలే.దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకొని ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించాలని సీఎం చంద్రబాబును అభ్యర్థించారు. దీనిపై సీఎం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశారు. దీంతో మొత్తం 28 మందికి రూ. కోటి 40 లక్షలను ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే రామాంజనేయులు తురకపాలెంలో అందజేయనున్నారు.
ఎలాంటి ప్రదేశాల్లో వైరస్ ఉంటుందంటే..
బర్ఖోల్డెరియా సూడోమల్లె అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా తడి నేలల్లో , నిలువ ఉన్న నీటిలో, బురద నేలల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆ ప్రదేశంలో నుంచి మనుషులు నడిచినప్పుడు ఆ బ్యాక్టీరియా సోకే అవకాశం ఉంటుంది.
గాయాలు ఉంటే..
శరీరంలో గాయాలు ఉంటే , గాయాల ద్వారా శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు గాలికి గాయం కాని పుండు కాని ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సారి నోటి ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశించ వచ్చు.చర్మ సంబంధ వ్యాధులు ఉన్నా ఈ బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
వ్యాధి లక్షణాలు…
బర్ఖోల్డెరియా సూడోమల్లె అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన స్వరం వస్తుంది.నీటి ద్వారా సంక్రమిస్తే లంగ్స్ ఇన్ ఫెశ్రీన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాధి సోకిన వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. కీళ్ల నొప్పులు ఉంటాయి కండరాల నొప్పులు ఉంటాయి ఆకలి లేక పోవడం కూడా ఈ వ్యాధి లక్షణమే.. దగ్గు తీవ్రంగా వస్తూ ఉంటుంది. దగ్గుతో పాటు తెమడ, రక్తం బయట పడడం లాంటివి జరుగుతాయి.మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువ. సకాలంలో గుర్తించి, యాంటీబయాటిక్స్తో చికిత్స చేయకపోతే ఇది ప్రాణాంతకం కావచ్చు. ఒక్కొక్క సారి ఈ వ్యాధి లక్షణాలు రెండు నెలల తరువాత బయటపడే అవకాశం ఉంది.
ట్రీట్ మెంట్ ఎలా..
ఈ వ్యాధి సోకిన వారు సకాలంలో వైద్య పరీక్షలు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ముందుగా రెండు వారాలు ఐవీ ద్వారా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే బ్యాక్టీరియా నశించే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆరునెలల పాటు తప్పని సరిగా యాంటీ బయాటిక్స్ వాడాలి..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బురదనేలలో ప్రయాణించకూడదు.. ముఖ్యంగా శరీరానికి పుండ్లు గాయాలు ఉన్న వారు కలిషితమైన నిలువ ఉన్న నీటికి దూరంగా ఉండాలి. కాళ్లకు షూస్ ధరించాలి. చేతులకు గ్లౌజ్ లు ధరించాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి వడబోచిన నీరు తాగాలి. ముఖ్యంగా మూత్ర పిండాల వ్యాధితో, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు అతి జాగ్రత్తగా ఉండాలి .
ఏయే దేశాల్లో ఎక్కువగా ఉంది
ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియాలోని ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, మరియు ఆస్ట్రేలియా దేశాల్లో ఈ వ్యాధి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 165,000 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారని అంచనా. ఇందులో దాదాపు ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 89 వేల మంది మరణిస్తున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఇందులో ఎక్కువగా మధుమేహం ఉన్న వారే అధికంగా ఉన్నారు.
…………………………………………………………….