* గేటు దూకి.. తాడుతో నాలుగో అంతస్తు పైకెక్కి..
* అగ్నిప్రమాదం నుంచి ఐదుగురిని కాపాడాడు..
* బాలుడి ధైర్యసాహసాలకు ప్రశంసలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అగ్నిప్రమాదం సంభవించిన ఆ కంపెనీలో స్నేహితుడి తల్లి ఉందని పరుగు పరుగున వెళ్లాడు. అక్కడి మంటలను చూసి అందరూ పారిపోతుంటే.. ఆ బాలుడు గోడదూకి లోపలకు వెళ్లాడు. ఓ తాడు సాయంతో ఏకంగా నాలుగు అంతస్తులకు ఎగబాకాడు. అదే తాడుతో ఇద్దరిని కిందికి దించాడు. ఇంతలో వచ్చిన అగ్నిమాపకసిబ్బంది నిచ్చెనను అందిస్తే.. దాని ద్వారా మరో ముగ్గురిని కిందికి దించాడు. మంటల నుంచి మొత్తంగా ఐదుగురిని కాపాడి.. భళా.. బాలా.. అంటూ అధికారుల, ప్రజాప్రతినిధుల అభినందనలు అందుకున్నాడు. ఆ బాలుడే సాయిచరణ్. వయసు 16 ఏళ్లు.
భళా.. బాలకా..!
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని అలెన్ హోమియో, హెర్బల్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో కొద్దిరోజులుగా మరమ్మతులు జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం వెల్డింగ్ పని చేస్తుండగా నిప్పురవ్వులు ఎగిశాయి. హోమియో ఔషధాల తయారీకి వినియోగించే ఆల్కహాల్, ఇతర రసాయనాలపై ఆ నిప్పురవ్వలు పడగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కంపెనీలో ఉన్న 50 మంది సిబ్బంది బయటకు ఉరుకులు.. పరుగులు పెట్టారు. నాలుగో అంతస్తులో చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులు కిందికి రావడానికి ఇబ్బంది పడ్డారు. వారిలో కేఎల్ఎన్ చారి అనే ఉద్యోగి.. ప్రాణాలు కాపాడుకోవడానికి అంత ఎత్తు నుంచి కిందికి దూకేయడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. బయటకు వెళ్లే దారిలేక.. ఎలా వెళ్లాలో దిక్కుతోచక.. భయంభయంగా సాయం కోసం ఎదురుచూస్తుండగా.. సాయిచరణ్ అనే బాలుడు తాడు సాయంతో పైకెక్కి వారిని కాపాడాడు. అతడు చూపిన ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే రూ.5వేలు రివార్డుగా ఇవ్వగా.. తనకు చేతనైన సాయం చేశానని, డబ్బు వద్దని సున్నితంగా తిరస్కరించాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా సాయిచరణ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కాగా.. ఈ అగ్నిప్రమాదంలో 12 కోట్ల విలువైన ఆస్తినష్టం వాటిల్లిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. ప్రమాదం జరిగి 18 గంటలైనా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.
—————————-