Kamalapur Belt Shops Crackdown
* బెల్ట్ షాపుల రహిత మండలం దిశగా అడుగులు వేస్తున్న గ్రామపంచాయతీలు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గ్రామాలు బెల్ట్ షాపు రహిత గ్రామాలుగా మారుతున్నాయి. ఈ మండలంలో బెల్ట్ షాప్ వ్యతిరేక ఉద్యమం నడుస్తుంది. ఎన్నో ఏండ్లుగా గ్రామాల్లో తిష్ట వేసిన అక్రమ (బెల్ట్ షాపుల) మద్యం దుకాణాలకు అడ్డుకట్ట వేసేందుకు మండలంలోని గ్రామ పంచాయతీలు నడుం బిగించాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపులకు చెక్ పెట్టేలా మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి బెల్ట్ షాపులకు చెక్ పెట్టాయి. గ్రామాల్లో విచ్చలవిడిగా వెలిసిన ఈ బెల్ట్ షాపుల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడుతున్నాయనే ఆవేదనతో గ్రామ పెద్దల మద్దతుతో ఈ ఆదర్శ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
* బెల్టు షాపుల నిర్మూలనపై గ్రామాల్లో ముమ్మర చర్చలు
మండలంలోని ఉప్పల్ పల్లి లో మొదలైన బెల్టు షాపుల వ్యతిరేక ఉద్యమం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలైన ఉప్పల్, కమలాపూర్ గ్రామాలు, గూనిపర్తిలో స్థానిక పాలకవర్గాలు బెల్టు షాపులను పూర్తిగా మూసివేయించి, రాత్రి వేళల్లో సైతం ప్రత్యేక నిఘా పెట్టి అక్రమ మద్యం అమ్మకాలకు చెక్ పెట్టాయి.
ఇదే స్ఫూర్తితో మండలంలో కానిపర్తి గ్రామంలో బెల్టు షాపుల నిర్మూలనే ధ్యేయంగా గ్రామపంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేసి బెల్ట్ షాపులకు నిర్మూలన చేయనున్నాయి. రానున్న రోజుల్లో మిగిలిన గ్రామాల్లో సైతం పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేసి, బెల్టు షాపులను నిషేధిస్తూ సర్వసభ్య తీర్మానాలు చేయాలని ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలు గట్టిగా యోచిస్తున్నాయి.
* గ్రామ పంచాయతీల జరిమానా – నజరానా
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే సదరు నిర్వాహకులకు రూ. 10,000 జరిమానా విధించబడుతుందని, అంతేకాకుండా గ్రామాల్లో అనధికారికంగా మద్యం విక్రయించే వారి సమాచారాన్ని పంచాయతీకి అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, వారికి తగిన పారితోషికం అందిస్తున్నట్లు, జరిమానా విధించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోతే, సదరు వ్యక్తులపై ఎక్సైజ్, పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేసి కేసులు నమోదు చేస్తామని పంచాయతీలు తీర్మానం చేశాయి.
* విచ్చలవిడి దందాకు అడ్డుకట్ట
గత కొన్ని ఏండ్లుగా మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇళ్ల మధ్యలో బెల్ట్ షాపులు వెలిశాయి. వైన్ షాపుల నిర్వాహకులు సిండికేట్గా మారి, నిబంధనలకు విరుద్ధంగా పల్లెల్లో ఈ కేంద్రాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ అసలు ధర కంటే రూ. 20 నుండి రూ. 50 వరకు అదనంగా వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. మద్యం అందుబాటులో ఉంటుండటంతో కూలీ పనులకు వెళ్లే పురుషులు, యువత మద్యానికి బానిసవుతున్నారు. దీనిపై గ్రామాల్లోని మహిళలు, గ్రామ పెద్దలు అసహనం వ్యక్తం చేయడంతో మండలంలోని గ్రామ పంచాయతీలు బెల్ట్ షాపులకు చెక్ పెట్టే తీర్మానాల వైపు అడుగులు వేశాయి.
* అధికారుల మద్దతు కోరుతున్న ప్రజలు
పంచాయతీలు తీర్మానాలు చేసినంత మాత్రాన సరిపోదని, వీటికి ఎక్సైజ్ , స్థానిక పోలీస్ అధికారుల పర్యవేక్షణ కూడా అవసరమని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకోకుండా, చట్ట వ్యతిరేక మద్యం అమ్మకాలను అరికట్టడంలో పంచాయతీలకు మద్దతుగా నిలిచి, బెల్ట్ షాపుల రహిత మండలం దిశగా అడుగులు వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
