* ఉత్తర ప్రదేశ్లో గజ ఈతగాళ్ల నిర్వాకం
* నీట మునిగి గల్లంతయిన ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్
ఆకేరు న్యూస్ డెస్క్: ఓ ప్రాణాన్ని కాపాడే స్థితిలో ఉన్నా.. స్పందించలేదు. ఎదురుగా ఓ మనిషి నీట మునుగుతున్నా చోద్యం చూశారు. రూ.10వేలు ఇస్తేనే దూకి కాపాడతామని గజ ఈతగాళ్లు బేరాలు మొదలుపెట్టారు. ఇంతలో పుణ్యకాలం గడిచిపోయింది. ఆ వ్యక్తి గల్లంతయ్యాడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఈ దారుణం చోటుచేసుకుంది. బనారస్ లో ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్దన్(Aditya Vardhan) బిల్హౌర్లోని నానమౌ వద్ద గంగానది ఘాట్(Ganganadhi Ghat)లో స్నానానికి దిగారు. సూర్య నమస్కారం చేస్తూ ఉండగా స్నేహితులు ఫొటో తీస్తుండడంతో వారివైపు చూస్తున్నారు. అలా కెమెరాను చూస్తూ ఘాట్లో కొంచెం కొంచెం లోనికి వెళ్లాడు. ప్రమాద హెచ్చరికను దాటేసి నీట మునిగిపోయాడు. అతడిని కాపాడాల్సిందిగా అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల(Swimmers)ను స్నేహితులు కోరారు. రూ. 10 వేలు ఇస్తేనే నీట్లోకి దిగుతామని వారు డిమాండ్ చేశారు. ఇస్తాం.. ఈలోపు కాపాడాలని కోరినా స్పం దించలేదు. ముందే డబ్బు ఇవ్వాలన్నారు. స్నేహితులు యూపీఐ(UPI) ద్వారా డబ్బు చెల్లించేసరికి, ఆదిత్య వర్దన్ నీట మునిగి గల్లంతయ్యారు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఏసీపీ అజయ్ కుమార్ తెలిపారు.