
ఆకేరు న్యూస్, డెస్క్ : గోవా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ (Ravi Naik 79) హఠాన్మరణం చెందారు. కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులుఉన్నారు. పోండాలోని ఆయన నివాసం వద్ద పార్థివదేహాన్ని ఉంచారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పిస్తున్నారు. రవి నాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంతాపం తెలిపారు. ఆయన చేసిన ప్రజాసేవ ఎన్నటికీ గుర్తిండిపోతుందన్నారు. గోవా రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని తన ఎక్స్ అకౌంట్లో సీఎం పేర్కొన్నారు. గోవాకు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. రెండోసారి 1994లో అతి తక్కువ కాలం గోవా సీఎంగా చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు అంటే కేవలం ఆరు రోజులు మాత్రమే ఆయన సీఎంగా చేశారు. కాగా, పోండా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరు సార్లు రవి నాయక్ గెలుపొందారు. మార్కెయిమ్ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో పోండా నియోజకవర్గం నుంచి తొలిసారిగా మహారాష్ట్ర వాది గోమాంతక్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 1989లో మార్కెయిమ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోండా నియోజకవర్గం నుంచి 1999, 2002, 2007, 2017లో గెలుపొందారు. ఇక బీజేపీ టికెట్‌పై 2022లో విజయం సాధించారు.
……………………………………………………….