* ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్పొరేటర్లకు టెన్షన్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
మరి కొద్ది రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు ముగియనుంది. అభివృద్ధి పనులు పూర్తి కావాలన్నా, కొత్తవి మొదలుపెట్టాలన్నా కేవలం వారం రోజుల్లోనే తక్షణ చర్యలు తీసుకోవాలి. కొత్తవాటికి కొబ్బరికాయలు కొట్టాలి. కానీ.. కార్పొరేటర్ బడ్జెట్ విడుదల కాలేదు. ఒక్కో డివిజన్‌కు రూ.2కోట్ల నిధులిస్తామని నవంబరు 25, 2025న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించినా కార్చరూపం దాల్చలేదు.
సంబరమే మిగిలింది..
ఫిబ్రవరి 11, 2021 పాలకమండలి కొలువుదీరింది. అప్పటి నుంచి కార్పొరేటర్ బడ్జెట్ పేరిట నయాపైసా కేటాయించలేదు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా, నిరసన తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలో పాలకమండలి గడువు ముగియనుండడం.. ఎన్నికలు నిర్వహించాల్సిన దృష్ట్యా కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయింపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్‌కు రూ.2కోట్ల చొప్పున 150 డివిజన్లకు రూ.300 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందులో 80 శాతం అంటే రూ.1.60 కోట్లు జీహెచ్ఎంసీ, 20 శాతం రూ.40 లక్షలు వాటర్బోర్టు ఇవ్వాల్సి ఉంది. ఐదేళ్ల ఆశ నెరవేరుతుందని కార్పొరేటర్లు సంబురపడ్డారు.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
నిధుల ప్రకటనతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కొందరు కలిసి ధన్యవాదాలు తెలపడంతో పాటు.. ప్రతిపాదిత పనులపై ఎండార్స్ చేయించుకున్నారు. అనంతరం సర్కిల్, జోనల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రహదారులు, వరద ప్రవాహ వ్యవస్థ, డ్రైనేజీ పైపులైన్లు వంటి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో 145 మంది కార్పొరేటర్లు ఉండగా.. 95 శాతానికిపైగా తమ బడ్జెట్లో ప్రతిపాదించిన పనులు చేపట్టలేదని చెబుతున్నారు.
ఎన్నికలు వస్తే కష్టమేనంటూ..
పాలకమండలి గడువు ముగిసిన అనంతరం మెగా కార్పొరేషన్‌ను మూడుగా విభజించే అవకాశాలు ఉన్నాయి. అనంతరరం ఎన్నికలు జరిగే అవకాశముంది. మరోసారి ఎన్నికల్లో బరిలో నిలవాలని భావిస్తోన్న మెజార్టీ కార్పొరేటర్లు వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పాలనాపరమైన ఇబ్బందులు, ఇతరత్రా కారణాలతో జాప్యం జరుగుతుండడం.. ఎక్కువ సమయం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రూ.2 కోట్ల పనులు ప్రారంభిస్తే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పే అవకాశముంటుందన్నది పలువురు అభిప్రాయపడుతున్నారు. నిధులు రాకుండా, పనులు మొదలుకాకుండానే ఎన్నికలు వస్తే కష్టమే అని ఆందోళన చెందుతున్నారు.
…………………………………………………………………….
