* సీబీఐ, ఈడీలకు సుప్రీం ధర్మాసనం ఆదేశం
* రఘురామరాజు పిటిషన్లపై విచారణ
ఆకేరు న్యూస్ డెస్క్ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (EX CM JAGANMOHANREDDY) అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని సుప్రీంకోర్టు(SUPRIMCOURT) సోమవారం ఆదేశించింది. కేసు ఆలస్యానికి గల కారణాలను ఆరా తీసింది. జగన్ కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం నేడు విచారణ జరిపింది. సీబీఐ, ఈడీ నివేదికలను రెండు వారాల్లోగా విడివిడిగా అందించాలని పేర్కొంది. డిశ్చార్జి, వాయిదా పిటిషన్లు, పెండింగ్ లో ఉన్న అంశాల వల్లే కేసు విచారణలో జాప్యం జరిగిందని న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు.
పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను కూడా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు గతంలో రోజువారీ విచారణకు ఆదేశించిందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా (JUSTICE ABHAY S OKA) నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్లో ఉన్న కేసు వివరాలను పరిశీలించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. సంబంధిత ట్రయల్ కోర్టు రికార్డులు, తెలంగాణ హైకోర్టు (TELANGANA HIGHCOURT) ఉత్తర్వులు, ఇతర పెండింగ్ కేసుల సమాచారాన్ని సమర్పించాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 13కు వాయిదా వేసింది.
……………………………