Mulugu
* కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
Mulugu| ఆకేరు న్యూస్, ములుగు: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవతా సేవలను మరింత విస్తృతం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. అదే సమయంలో చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ‘మాట్లాడే బొమ్మ’ను కలెక్టర్ ఆవిష్కరించారు.
భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సోమవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై వారితో చర్చించారు.
రెడ్ క్రాస్ సేవలపై దృష్టి
రెడ్ క్రాస్ కార్యకలాపాలను మానవతా దృక్పథంతో మరింత చురుగ్గా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సహాయం అవసరమైన వారిని గుర్తించి సకాలంలో సేవలు అందేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ స్వచ్ఛంద సేవకులను భాగస్వాములను చేసుకోవాలని సూచించారు.
స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ తెలిపారు. రక్తదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు యువతను స్వచ్ఛంద రక్తదానానికి ప్రోత్సహించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందేలా వైద్య సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. విపత్తులు, ప్రమాదాల సమయంలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు స్వచ్ఛంద సేవకులను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
చిన్నారుల భద్రతకు ‘మాట్లాడే బొమ్మ’
చిన్నారులకు మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను సులభంగా వివరించేందుకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సమకూర్చిన ‘మాట్లాడే బొమ్మ’ను కలెక్టర్ ఆవిష్కరించారు. బొమ్మలోని నిర్దేశిత భాగాలను తాకినప్పుడు మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి ఎలా వివరిస్తుందో అధికారులు కలెక్టర్‌కు ప్రదర్శించారు.
చిన్నారులకు తమ భద్రతపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ అన్నారు. పాఠశాలల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో మాట్లాడే బొమ్మను ఉపయోగించాలని సూచించారు. అసౌకర్యం కలిగించే స్పర్శ లేదా వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు విషయాన్ని తెలియజేసేలా పిల్లల్లో ధైర్యాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు.
మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా రెండు మాట్లాడే బొమ్మలను సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. ఒకదాన్ని జిల్లా కోర్టుకు, మరొకదాన్ని బాల రక్ష భవన్లో ఉంచనున్నట్లు వివరించారు. పాఠశాలలు, ఇతర అవగాహన కార్యక్రమాల్లో వీటిని ఉపయోగించి మంచి స్పర్శ, చెడు స్పర్శతో పాటు లైంగిక వేధింపులు, బాల్యవివాహాల నిర్మూలనపై చిన్నారులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ అల్లం అప్పయ్య, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి శిరుప సతీష్ కుమార్, రాష్ట్ర పాలకమండలి సభ్యుడు కొత్తపల్లి ప్రసాదరావు, డీడబ్ల్యూఓ ప్రేమలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, పరిరక్షణ అధికారి హరికృష్ణ, సోషల్ కోఆర్డినేటర్ సుమన్, సీనియర్ అసిస్టెంట్ శంకర్, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
