* భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చాగోష్ఠులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ తొలిరోజు ఉత్సాహపూరిత వాతావరణంలో ఆశాజనకంగా సాగింది. దేశ, విదేశాలతో పాటు, రాష్ట్రం నుంచి వచ్చిన ప్రముఖులతో సమ్మిట్ ప్రాంగణం రోజంతా సందడిగా మారింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేట – బేగరికంచలో 100 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తొలిరోజు నయా నగర నిర్మాణానికి ఆర్థిక మేధోమథనం జరిగింది. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖ ఎంఎన్సీల ప్రతినిధులతో పాటు ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, ప్రముఖలతో చర్చాగోష్టులు చేపట్టింది. సదస్సుకు తొలిరోజు దాదాపుగా 2వేల మందికిపైగా అతిథులు హాజరయ్యారు.
ఫ్యూచర్‌సిటీలో భారీ పెట్టుబడులు
రాబోయే తరాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కందుకూరు మండలం మీర్కాన్పేటలో చేపడుతున్న ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపారు. ఇప్పటికే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్‌సిటీ, కమిషనర్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అలాగే రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 నుంచి మీర్కాన్‌పేట వరకు, మీర్కాన్‌పేట నుంచి ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు రీజినల్ రింగురోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ భారీ పెట్టుబడులకు శ్రీకారం జరిగింది.
ప్రత్యేక యాక్సెస్
వీవీఐపీ పారిశ్రామికవేత్తలకు డీఎస్పీ స్థాయి అధికారితో భద్రతా కల్పించారు. వీవీఐపీ పారిశ్రామికవేత్తలకు, సీనియర్ అధికారులకు ప్రత్యేకంగా యాక్సెస్ పాస్‌లు జారీచేశారు. సమ్మిట్ హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, రంగురంగుల జెండా మేళవింపుతో స్వాగతం పలికారు. అడుగడుగునా చారిత్రాత్మక కట్టడాల నమూనాలు, పర్యటక ప్రదేశాలను భారీ స్ర్కీన్లతో ప్రదర్శించారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బేగరికంచ వరకు విద్యుత్ దీపాలంకరణలతో కటౌట్లు, ప్లెక్సీలు, భారీ ప్రొజెక్టర్లతో ప్రదర్శించారు.
154 మంది ప్రముఖుల రాక
ఫ్యూచర్ సిటీ రోడ్లన్నీ ప్రముఖుల వాహనాలతో రద్దీగా మారాయి. సోమవారం ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వాహనాలతో పాటు, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, 44 దేశాలకు సంబంధించి 154 మంది ప్రముఖుల రాకతో తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్తూరు గేట్ మీదుగా గ్లోబల్ సమ్మిట్ ప్రాంతం వరకు వాహనాలతో కిటకిటలాడింది. ప్రపంచ నలుమూలల నుంచి ఆర్థికవేత్తల రాకతో ఆదివారం రాత్రి నుంచి సుమారు 4వ ేల మంది పోలీసుల బలగాలు రంగంలోకి దిగారు. కందుకూరు, తుక్కుగూడలో కవాతు నిర్వహించారు. అనంతరం ఈ రెండు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
…………………………………………….
