* ఉత్కంఠగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
* అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న ప్రచారం
* ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
* రెండు రోజుల్లో ముగియనున్న ప్రచార గడువు
ఆకేరు న్యూస్, వరంగల్ : జరుగుతున్నది ఓ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ప్రచారం జరుగుతున్న తీరు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నది. ఆ స్థానం కోసం మూడు పార్టీలూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మాటల తూటాలతో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనిపై దృష్టి సారించారు. ఈ ఎన్నిక పార్టీకి ప్రతిష్ఠాత్మకమని నేతలకు హితబోధ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది.
బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో ఏకంగా 52 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, 11 మంది మాత్రమే నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ ఉప ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పరిధిలోని 12 జిల్లాలు అయిన సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ పరిధిలోని పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు.
స్పీడు పెంచిన ప్రధాన పార్టీలు
పట్టభద్రుల ఉప ఎన్నికను తెలంగాణలోని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారానికి మరో రెండు రోజులే సమయం మాత్రమే ఉండడంతో అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు, బీజేపీ, బీఆర్ఎస్ కూడా ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. అధికారంలోకి వచ్చాక తాము చేపట్టిన ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇటు ఈ తొమ్మిదిన్నరేళ్లలో తాము తెలంగాణ రాష్ట్రానికి చేసిన సంక్షేమాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ..కాషాయపార్టీ నేతలు ముందుకెళ్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల మూడు పార్టీలకు కీలకం కావడంతో.. పట్టభద్రులు ఎవరివైపు నిలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..
ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న బరిలో దిగగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో పాటు ఆయా పార్టీ నేతలంతా మూడు ఉమ్మడి జిల్లాల్లో విస్తృత ప్రచారాన్ని చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు వివరిస్తు ఓటర్లను ఆకట్టుకునే పడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలయితే తాము ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన, పరిశ్రమల స్థాపన తదితర అంశాలను చెబుతూనే.. ఆరునెలల్లోనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళుతున్నారు. అటు కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు కేటాయింపు తదితరఅంశాలతో బీజేపీ ప్రచారం చేస్తున్నది.
నిరుద్యోగులే ఎక్కువ
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాల్లో 4, 63, 839 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వరంగల్‌లో అత్యధికంగా 1,72524, నల్లగొండలో 1,65,778, ఖమ్మంలో 1,23,504 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో నిరుద్యోగులే ఎక్కువ మంది ఉండగా..ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది.
ఉద్యోగ నియామకాలపై గుర్రు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నిరుద్యోగుల ఓట్లే కీలకం కానున్నాయి. అయితే వీరంతా ప్రధాన పార్టీలపై గుర్రుగానే ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడంతో పాటు, నోటిఫికేషన్లు జారీ చేయకపోవడమే కాకుండా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఇటు పీఆర్సీపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయినా ఇచ్చిన హామీ ప్రకారం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. అలాగే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో టీఎస్పీఎస్సీ అక్రమాలు, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని.. నిరుద్యోగులు, 317 జీఓ తీసుకురావడం పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి వారంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారనేదే హాట్ టాపిక్‌గా మారింది.
————————–