
* వరంగల్ కలెక్టర్ సత్య శారద
ఆకేరున్యూస్, వరంగల్: యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి సంబంధిత శాఖల అధికారులు, రైన్మిల్లర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే చెల్లింపులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 184 కొనుగోలు కేంద్రాలకు గాను 179 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 22 వేల 624 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. రైస్ మిల్లర్లు తాలు, తరుగు పేరుతో కోతలు లేకుండా కొనుగోలు చేయు విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు నీడ కొరకు షామియానా, తాగునీరు, ప్యాడి క్లీనర్, మాయిశ్చర్స్, తూకపు యంత్రాలు, టార్పాలిన్లు, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సన్నరకం, దొడ్డురకం ధాన్యం విడి విడిగా కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. మిల్లులకు సరఫరా చేసే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరి అని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డిఆర్డిఓ కౌసల్య దేవి, డిసిఎస్ఓ కిష్టయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………