* పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం శ్రీ ఇల్లందకుంట పుణ్యక్షేత్రం లో సీతారాముల కల్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… పవిత్రమైన ఇల్లందకుంట రామాలయంలో కల్యాణ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని, ఆ రాముడి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏళ్ల తరబడి భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జమ్మికుంట రైస్, కాటన్ మిల్లర్ల సేవలను మంత్రి పొన్నం, ఇంచార్జి ప్రణవ్ ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆలయ చైర్మన్ ఇంగిలి రామారావు, హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వివిధ మండలాల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
