* వర్మకు ప్రమాదముందా? పదవి రాబోతుందా?
* కీలక పదవి వరించనుందని అనుచరుల ఆనందం
ఆకేరు న్యూస్, పిఠాపురం : తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎన్ వర్మ(SVSN VARMA)కు ప్రభుత్వం భద్రత కల్పించింది. ఆయనకు ఒక జతగా (1+1) గన్మెన్లను కేటాయించింది. రెండు రోజుల క్రితం ఆయన సీఎం చంద్రబాబునాయుడు(CHANDRABABU NAIDU)ను కలవగా తాజాగా గన్మెన్ల కేటాయింపు చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో వర్మ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో ఆ సీటును జనసేనాని పవన్ కల్యాణ్ (PAVANK KALYAN)కు కేటాయించారు. దీంతో వర్మ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అధినేతపై కూడా వర్మ అనుచరులు నోరు జారారు. దీనిపై స్పందించిన చంద్రబాబునాయుడు వర్మను పిలిపించుకుని మాట్లాడారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో మంత్రిని చేస్తానని కూడా హామీ ఇచ్చారు.
వర్మకు క్యాబినెట్ హోదా పదవి కోసం 2024 ఎన్నికల తర్వాత నుంచి ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారు. గతంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన అనుచరులు అనుకున్నారు.. అయినా.. సమీకరణాల వల్ల ఆయనకు పదవి వరించలేదు. ఆ తర్వాత కీలక బాధ్యతలు దక్కుతాయని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే.. వర్మకు ఇద్దరు గన్మెన్లను కేటాయించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు కీలక పదవి దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
వర్మ విజ్ఞప్తి మేరకే భద్రత
అయితే.. వర్మ విజ్ఞప్తి మేరకు భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. తనకు ప్రమాద భయం పొంచి ఉందని ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో, ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, రెండు గన్మెన్లు వర్మకు వెంట ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంపై ఇంటెలిజెన్స్ విభాగం భిన్నంగా స్పందించింది. వర్మ భద్రతకు గన్మెన్లు అవసరం లేదని తమ ఆధారాలు చూపించలేవని, వారి నుంచి అలాంటి నివేదిక ఏమీ ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. ఇది కొంత మేర చర్చనీయాంశంగా మారింది.
……………………………………………..
