* స్ట్రీట్ కారు రైలు పట్టాలు తప్పడంతో దుర్ఘటన
* జాతీయ సంతాప దినం ప్రకటించిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్ డెస్క్ : పోర్చుగల్ రాజధానిలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లిస్బన్లో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా పేరు పొందిన ఎలక్ట్రిక్ స్ట్రీట్ కారు (రైలు) (Electric Street Car Rail) పట్టాలు తప్పడంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సందర్భంలో అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. లిస్బన్ (Lisbon) నగరంలోని అవెనిడా డా లిబర్డేడ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు క్యారేజ్ నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ విషాదం నేపథ్యంలో పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసా కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఆదివారం వరకు జరగాల్సిన పుస్తక మహోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష భవనం తెలిపింది. గురువారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ఇది ఒక విషాదకరమైన ఘటన అని, ఇలాంటి ప్రమాదాన్ని గతంలో చూడలేదని మేయర్ కార్లోస్ మోదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లిస్బన్లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా బాధితులకు సంఘీభావం ప్రకటించింది. ప్రమాద కారణాలపై త్వరలోనే సమగ్ర దర్యాప్తు ప్రారంభిస్తామని పోర్చుగల్ ప్రభుత్వం పేర్కొంది. 19వ శతాబ్దం చివర్లో నిర్మించిన గ్లోరియా ఫ్యూనిక్యులర్, ఏటవాలు కొండలపై నడుస్తూ పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. ప్రతీ ఏడాది వేలాది మంది ఈ రైలులో ప్రయాణిస్తారు. స్థానికులు, పర్యాటకులు దీనిని ఉపయోగిస్తారు. అయితే, 2018లో కూడా ఇదే ఫ్యూనిక్యులర్ పట్టాలు తప్పింది. కానీ ఆ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఇప్పుడు మాత్రం భారీ ప్రాణనష్టం జరగడం స్థానికులను, పర్యాటకులను తీవ్రంగా కలిచివేసింది.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
