*అత్యుత్సాహం ప్రదర్శించిన సర్పంచ్ లు
ఆకేరు న్యూస్ , హనుమకొండ : ఉన్నట్లుండి ఆ రెండు గ్రామాల్లో వీధి కుక్కలు మాయమయ్యాయి.. ఎలా మాయమయ్యాయని తెలిస్తే ఆశ్చర్య పోవాల్సి వస్తోంది. గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఉన్న మాట వాస్తవమే.. మనుషులను కరుస్తూ మనుషల ప్రాణాలకు ముప్పు తెస్తున్న వీధి కుక్కలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. కానీ అది శాస్త్రీయ పద్దతిలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేయించాలి.. కానీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినహామీల మేరకు ఆ ఇద్దరు సర్పంచ్ లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏక పక్షంగా వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది చేత చంపించించారు. ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండేది, ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వీధి కుక్కల బెడదను నివారిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆ రెండు గ్రామాల సర్పంచ్లు గ్రామ పంచాయతీ సిబ్బంది చేత కుక్కలకు విషాహారం తిన్పించి చంపించి వేశారు. ఏకంగా 120 కుక్కలను చంపించి వేసి పాతిపెట్టించారు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సేవ్ యానిమల్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేవ్ యానిమల్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు, వెటర్నరీ సిబ్బంది గ్రామ శివారులో తవ్వకాలు జరుపగా 120 కుక్కల కళేబరాలు లభ్యమయ్యాయి, వెంటనే కళేబరాల శ్యాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపించారు. కుక్కలకు విషం ఇచ్చి హతమార్చినట్లు ల్యాబ్ టెస్్టల్లో తేలింది. ఈ చర్యను కొందరు గ్రామస్థులు సమర్థిస్తుండగా ఇలా చేయడం దారుణమని మరికొంత మంది విమర్శిస్తున్నారు. జంతు హింస నిరోధక చట్టం ప్రకారం వీధి కుక్కలను చంపడం తీవ్రమైన నేరం ఈ నేపధ్యంలో ఇద్దరు సర్పంచ్ లతో సహా మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేస్ నమోదు చేశారు.
………………………………………………………………

