గూనిపర్తిలో ఇందిరమ్మ ఇంటిని పరిశీలిస్తున్న కలెక్టర్ చాహత్ బాజ్పాయి
* గూనిపర్తిలో ఇంటిని పరిశీలించిన చాహత్ బాజ్పాయి
* నాణ్యతపై లబ్ధిదారుకు అభినందనలు
Hanumakonda| ఆకేరు న్యూస్, కమలాపూర్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని నాణ్యతతో పూర్తి చేయడంపై లబ్ధిదారు ను కలెక్టర్ చాహత్ బాజ్పాయి అభినందించారు. కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో ధనలక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలను లబ్ధిదారును అడిగి తెలుసుకున్నారు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఏర్పాటు చేశారా? మరుగుదొడ్డి నిర్మించుకున్నారా? అనే విషయాలను ఆరా తీశారు. ఇంటి నిర్మాణం చక్కగా ఉందని ప్రశంసిస్తూ ధనలక్ష్మి కుటుంబ సభ్యులను అభినందించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను మిగతా లబ్ధిదారులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, గృహప్రవేశాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అనంతరం గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవన పనులను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాధిక, తహసీల్దార్ సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

