* తెలంగాణలో హీటెక్కుతున్న రాజకీయం
* రాజీనామాకు సిద్ధం.. మీరు సిద్ధమా..
* ఒకరికొకరు సవాళ్లు.. ప్రతిసవాళ్లు
* ఎవరూ తగ్గేదేలే లే.. రాజీనామాలూ చేసేదీలే!
* తాజాగా రాజీనామా లేఖ తో గన్ పార్క్ కు చేరుకున్న హరీశ్ రావు
ఆకేరు న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్ :
పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా..
– సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్
హరీశ్రావూ.. రాజీనామా లేఖ రెడీ చేసి పెట్టుకో.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరతా..
– జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌కు రెండు సీట్లు కూడా రావు, వస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఆగస్టు 15లోగా రుణమాఫీ ఏకకాలంలో చేస్తే కేసీఆర్ రాజకీయాలు మానుకుంటారా?
– రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఓట్ల కోసం ఎక్కడికెళ్లినా రుణమాఫీ చేస్తానని అక్కడి దేవుళ్లపై రేవంత్‌రెడ్డి ఒట్టేసి చెబుతున్నారు. దేవుళ్ల మీద కాదు.. కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పు.
– బీజేపీ మహబూబ్‌నగర్ అభ్యర్థి డీకే అరుణ సవాల్
ఇప్పుడు తెలంగాణలో సవాళ్ల రాజకీయాలు నడుస్తున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చెప్పింది చేస్తే మేం రాజీనామాలకు సిద్ధం.. చేయకపోతే మీరు సిద్ధమా అంటూ.. చాలెంజ్‌లు చేస్తున్నారు. రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా హరీశ్‌రావు తన రాజీనామా లేఖతో ఈరోజు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే.. రాజీనామాకు సిద్దమని స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేక రూపొందించి.. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కూడా రాజీనామా లేఖతో రావాలని, ఆయనకు కుదరకపోతే సిబ్బందితో అయినా రాజీనామా లేఖ పంపాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి
అమర తెలంగాణలో తాము 8 నుంచి 12 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. బ రెండు ఎంపీ సీట్లు కూడా రావని, ఒక వేళ వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తామని, మహిళలకు రూ.2500 పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ రెండు పథకాలు అమలు చేస్తే కేసీఆర్ రాజకీయాలు మానుకొని ఇంట్లో కూర్చుంటారా? అని ప్రశ్నించారు.
రేవంత్ వర్సెస్ డీకే అరుణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా హామీలు అమలుచేయాలనే చిత్తశుద్ధి ఉంటే దేవుళ్ల మీద కాదని, ఆయన కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ముఖ్యమంత్రి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఏనాడైనా సేవాలాల్ గుడికి వెళ్లారా?, బావోజీ జాతరకు వెళ్లారా?, ఎన్నికలప్పుడే దేవుళ్లేందుకు గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ లో తనను ఓడించేందుకే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో తనకు ఎదురులేదని చెప్పుకుంటున్న రేవంత్, ఇప్పటికే ఆరు సార్లు జిల్లాకు వచ్చారని, పాలమూరులో ఓడిపోతారనే భయంతోనే ఇన్ని సార్లు వస్తున్నారని దుయ్యబట్టారు.
రేవంత్ వర్సెస్ హరీశ్ రావు.. ముదురుతున్న వివాదం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావుల మధ్య అయితే సవాళ్ల రాజకీయం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్టు పంద్రాగస్టులోపు ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. అలాగే వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలతో పాటు పదమూడు హామీలను కూడా అమలు చేయాలి. అప్పుడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని ఇద్దరం ప్రమాణం చేద్దాం. ఇందుకోసం అసెంబ్లీ ముందున్న అమరుల స్తూపం వద్దకు నేను వస్తాను. సీఎం రేవంత్‌రెడ్డి కూడా రావాలి’’ అని హరీశ్‌రావు రెండో రోజుల క్రితం సవాల్ చేశారు. ఆరోజు సాయంత్రమే వరంగల్ లో జరిగిన జనజాతర సభలో హరీశ్‌రావు సవాల్ కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. ‘‘హరీశ్‌రావు.. రాజీనామా లేఖ రెడీ చేసి పెట్టుకో. నేను ఆగస్టు 15లోపు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరతా’’ అని ప్రతిసవాల్ చేశారు. కాగా, చెప్పినట్లుగానే హరీశ్‌రావు ఈరోజు రాజీనామా లేఖతో అమరుల స్తూపం వద్దకు వచ్చారు. రేవంత్ కూడా రావాలని డిమాండ్ చేశారు. దీనిపై రేవంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
————————————————————