
* పంద్రాగస్టున జోరుగా కురిసే అవకాశం
* తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటన జారీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గత పది రోజులుగా తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ఎగువ వరద నీరు చేరి గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగి ప్రవహిస్తన్నాయి. హైదరాబాద్ జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. ఈ జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు వర్షాలు ఇలానే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 10వ తేదిన తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 11న ఈ ప్రభావం 19 జిల్లాల్లో కనిపించనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (LPA) ఏర్పడబోతోందని, ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆగస్టు 14 నుంచి 17 వరకు తెలంగాణ అంతటా వర్షాల హెచ్చరిక జారీ అయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకటి లేదా రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) నాడు కూడా వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఆగస్టు 14 నుంచి 17 వరకు దంచికొట్టే వానల్లో ఒకట్రెండు రోజులు మాత్రం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
…………………………………….