
ఊళ్లూ - చెరువులయినాయి
*తెలంగాణ ఆగమాగం…
* ముంపులో ఊళ్లకు ఊళ్లు
* ప్రజల తీవ్ర ఇబ్బందులు
* సురక్షిత ప్రాంతాలకు బాధితులు
* ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
* సిరిసిల్ల జిల్లాలో వరదల్లో చిక్కుకున్న రైతులు
* రంగంలోకి ఎయిర్‌ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్
* ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ఉధృతి
* ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్న వాగు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ ఆగమాగమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెరువుల మత్తళ్లు పొంగి పొర్లుతున్నాయి . వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు, కల్వర్టులు నిలిచిపోవడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండిపడి వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఇసుకమేటలు వేశాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో దంచికొట్టిన కుండపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం భీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న అర్గొండ స్టేషన్లో 42 సెం.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో దీంతో జనజీవనం స్తంభించిపోయింది. పెద్దాపూర్ ఎస్సారెస్పీ కెనాల్లో శ్రీకాంత్‌రెడ్డి గల్లంతయ్యాడు. అతడి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
జలదిగ్భందం
జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్కూళ్లకు విద్యాశాఖసెలవు ప్రకటించింది. సారంగపూర్ మండలం రేచపల్లిలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. వరదల ధాటికి రేచపల్లిలో పంట పొలాలు తడిసిముద్దయ్యాయి. సారంగపూర్, రాయకార్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల పట్టణంలోనూ పలు ప్రాంతాల్లో వరద పొంగుతోంది. హనుమకొండ జిల్లా ఖాజీపేట లోని పలు ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పాత్ బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో వరద భారీ ఎత్తున చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు అ వస్థలు పడుతున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి రైల్వేస్టేషన్ లో ట్రాక్ పై వరద నీరు నిలిచిపోయింది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతోంది. రాష్ట్రంలోని వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెబుతున్నారు.
కొట్టుకుపోయిన కార్లు, వాహనాలు
కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయం అయ్యింది. కాలనీలోని ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అధిక వర్షాల వలన జాతీయ రహదారి 44 పైకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. బీబీపేట మండలం జనగామలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్ద చిక్కుకుని రైతు రాజిరెడ్డి మృతి చెందారు. ప్రస్తుతం కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు నివారణ చర్యలను వేగవంతం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి జాతీయ రహదారి వెంబడి పర్యటించి సహా సహాయక చర్యలలో పాల్గొన్నారు. కాలనీలో చిక్కుకపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాను కూడా భారీ వరదలు అతలాకుతలం చేశాయి. మెదక్ లోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పిల్లికుంట సబ్ స్టేషన్ నిండా మునిగిపోయింది. రామాయణపేట జలదిగ్బంధంలో చిక్కుకుంది.
రెస్క్యూ ఆపరేషన్
సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింద. భారీ వరదల కారణంగా వాగులో చిక్కుకున్న రైతులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో ఐదుగురు రైతులను అధికారులు రక్షించారు. వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కాసేపట్లో సిరిసిల్లకు మరో రెండు హెలికాప్టర్లు వెళ్లనున్నాయి. కాగా, సిరికొండ మండలం గడ్కోల్ వద్ద కప్పలవాగు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. ఇందల్వాయి మండలంలోని వరదలో జీకే తాండ మునిగిపోవడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. హనుమకొండ జిల్లాలో కటాక్షపూర్ చెరువు అలుగు పారుతోంది. ములుగు జిల్లా తాడ్వాయిలో 15 సెం.మీల వర్షపాతం నమోదైంది. వెంకటాపూర్ లో 12 సెంమీ., గోవిందరావు పేటలో 11 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో జంపన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. మేడారం వద్ద బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తోంది. పసర నుంచి తాడ్వాయి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు వాహనాలను దారి మళ్లించారు. జలగలంచ వాగు ఉధృతితో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
నిండుకుండల్లా ప్రాజెక్టులు
నిజామాబాద్ జిల్లా రామడుగు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 26,433 క్యూసెక్కులుగా ఉంది. రామడుగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1278 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1278 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద 37.7 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. భద్రాచలం వద్ద 37.7 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. తాలిపేరు జలాశయం 24 గేట్లు ఎత్తి 57 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద చేరుతోంది. శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 7,72,345 క్యూసెక్కులు కావడంతో 40 గేట్లు ఎత్తి 7,16,262 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ16.56 టీఎంసీలుగా ఉంది. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొండపోచమ్మ కాలువకు గండి పడడంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు వరద నీరు చేరినట్లు స్థానికులు వాపోతున్నారు.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుంఆ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా ఉదయం నుంచీ వాన పడుతోంది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానాకి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, నాంపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మేడ్చల్, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమై నగరాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.
————————–