
* వాట్సప్ సేవలు వినియోగించుకోవాలని ప్రకటనలు
ఆకేరు న్యూస్, విజయవాడ : పౌర సేవల అమలులో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)కొత్త పుంతలు తొక్కుతోంది. క్యూలు, వేచి చూసే ధోరణ లేకుండానే ప్రజలకు కావాల్సిన సేవలు ఫోన్ అందుతున్నాయి. విజయవాడ దుర్గమ్మ దర్శనం టికెట్ల కోసం కొందరు దేవస్థానం వెబ్సైట్ ఉపయోగిస్తే, ఇంకొందరు క్యూలైన్లలో నిల్చోని టికెట్లు తీసుకునేవారు. అయితే ఇవే కాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా టికెట్లు సహా పలు సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం వంటి ఆలయాల్లో కూడా వాట్సప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
95523 00009లో హాయ్ అంటే..
దేశంలోనే తొలిసారిగా “మన మిత్ర” పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌కు జనవరి 30వ తేదీన శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అధికారిక వాట్సాప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను సులభతరం చేసేందుకు ప్రవేశ పెట్టిన వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా విజయవాడ (Vijayawada)శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్జిత సేవ, విరాళం, దర్శనం టిక్కెట్లు పొందేందుకు కల్పించిన అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దేవస్థానం వెబ్సైట్, ఆర్జిత సేవా కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, అదనంగా వాట్సాప్ నంబరుతోనూ వీటిని పొందవచ్చని చెప్పారు.
సేవలు పొందడం ఇలా..
95523 00009 వాట్సాప్ నంబరుకు హాయ్ అని మెసేజ్ పంపడంతో సేవను ఎంపిక చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత టెంపుల్ బుకింగ్ సర్వీసెస్‌ను ఎంచుకొని విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని ఆలయ దర్శనం, టెంపుల్ సేవ, టెంపుల్ డొనేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఏది కావాలంటే అందులో చూడొచ్చు. ఉదాహరణకు అష్టోత్తర నామార్చన సేవను బుక్ చేసుకుంటే టైం స్లాట్ ఎంచుకోవాలి. ఆపై Continue బటన్ నొక్కి ఎంత మంది హాజరవుతారు, ఆధార్ లేదా ఇతర ఐడీ వివరాలు, గోత్రం, పుట్టిన తేదీ ఎంటర్ చేసి Continueపై క్లిక్ చేయాలి. నెక్ట్స్ స్క్రీన్‌పై వ్యక్తులు, పూజ, రుసుము వివరాలు సరిచూసుకొని Confirm నొక్కితే పేమెంట్ ఆప్షన్ వస్తోంది. నగదు చెల్లించి వాట్సాప్ ద్వారా వచ్చే టిక్కెట్‌ను ప్రింట్ తీసుకుని ఆలయంలో సేవలు పొందొచ్చు.
……………………………………..