* ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ (KCR) కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ ఆయన వేసిన రిట్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ (Justice L Narasimha Reddy Commission) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కేసీఆర్ తమ ముందు హాజరుకావాల్సిందిగా.. ఈ కమిషన్.. ఇప్పటికే 2సార్లు కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చింది. అయితే.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా కమిటీ ఏర్పాటైందని, కమిషన్ విచారణ తీరు కూడా సరిగా లేదని కేసీఆర్ తప్పుబట్టారు. ఈ కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఒప్పందాల విషయంలో తమ ప్రభుత్వం అన్నీ పద్ధతిగా చేసిందనీ, ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని తెలిపారు. దీనిపై సోమవారం కోర్టులో వాదనలు జరిగాయి. కేసీఆర్ తరఫున ఆదిత్య సోందీ, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి (A Sudarshan Reddy) తమ వాదనలను వినిపించారు. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసీఆర్ పిటిషన్ ను కొట్టేసింది. ఈక్రమంలో కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు అవుతారా? సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది ఉత్కంఠగా మారింది.
————————————-