* ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు, విద్యార్థులు
* కొనసాగిన పలు విద్యాసంస్థలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ (GHMC) వరిధిలో మంగళవారం వేకువజాము నుంచి కుండపోతగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో హైదరాబాద్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పార్సిగుట్ట, సనత్నగర్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వర్షపు నీటిలో కొట్టుకుపోయారు. హైదరాబాద్లో మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ (Meteorological Department) వెల్లడించింది. నగరానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) ల డీఈవో(DEO)లు ఆదేశాలు జారీచేశారు. అయితే ఆ ప్రకటన ఆలస్యంగా వచ్చింది. ఉదయం 8.30కు ప్రకటన రావడంతో అప్పటికే తల్లిదండ్రులు పిల్లలను రెడీ చేసి వానల్లోనే స్కూళ్లకు తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక సెలవు అని తెలియడంతో ఉసూరుమని వెనుదిరిగారు. దీనిపై నెట్టింగ విమర్శలు వైరల్ అవుతున్నాయి. విద్యాశాఖ ఆలస్యంగా స్పందించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా సబితారెడ్డి ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా వివాదం తలెత్తిన విషయం గమనార్హం.
——————