* అనుమానంతో అమానుషంగా ప్రవర్తించిన భర్తలు
* గర్భిణి కడుపుపై కూర్చుని.. కర్కశత్వంగా ఒకరు..
* భార్యను చంపి.. ముక్కలను కుక్కర్లో ఉడికించిన మరొకరు..
* సంచలనంగా మారిన నేరాలు
* మీర్‌పేట మహిళ హత్య కేసులో మరో కొత్త అనుమానం?
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : అనుమానం పెనుభూతమై.. మనుషులమనే విషయాన్నేమరచిపోయారు వాళ్లు. ఏడడుగులు తమతో నడిచిన భార్యల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. క్రూరంగా చంపేశారు. ఏడు నెలల గర్భిణి కడుపుపై కూర్చుని.. ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరిరాడకుండా భార్యను చంపిన ఘటనలో పిండం కూడా బయటకు రావడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రెండు రోజులకే.. మరో వ్యక్తి.. అత్యంత దారుణంగా భార్యను హత్య చేశాడు. యూట్యూబ్‌లో క్రైమ్, హర్రర్ చిత్రాలు చూస్తూ.., భార్యను మటన్కత్తితో పొడిచి చంపేశాడు. అంతేకాదు.. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి.. ఆ ముక్కలను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలు భయానక వాతావరణాన్నిసృష్టించాయి.
ప్రేమించి పెళ్లాడి.. క్రూరంగా చంపేశాడు..
రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఓ ఘోరంతో హైదరాబాద్ లోని కుషాయిగూడ ఉలిక్కిపడింది. సాధారణంగా భార్య గర్భంతో ఉంటే.., భర్త కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కొందరైతే భార్యను కాలు కూడా కిందపెట్టనీయరు. కానీ.., భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమె కడుపుపై కూర్చుని.. ఊపిరాడకుండా చేసి.. చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కాచిగూడ(Kachiguda)కు చెందిన సచిన్ సత్యనారాయణకు కాప్రా(Kapra)కు చెందిన స్నేహతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో 2022లో వీళ్లద్దరూ పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. 2023లో వీరికి ఓ బాబు జన్మించాడు. బాబు పుట్టాక.. సచిన్ పని మానేసి జులాయిగా తిరగటంతో వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బిడ్డను అమ్మేయాలని చూశాడు సచిన్. స్నేహ పోలీసులను ఆశ్రయించడంతో అడ్డుకట్టపడింది. కొన్ని రోజులకే బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత భార్యభర్తలు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు.
భార్య గర్భవతి అని తెలియడంతో..
గతేడాది డిసెంబర్ నుంచి కాప్రాలో ఓ గది అద్దెకు తీసుకుని మళ్లీ కాపురం మొదలుపెట్టారు. అయితే.. భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. రోజూ మాటలతో వేధించేవాడు. చివరకు ఆమెను చంపేయాలని నిర్ణయించుకుని, ఈనెల 15న రాత్రి స్నేహకు బలవంతంగా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న భార్య కడుపుపై కూర్చొని దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా చంపేశాడు. ఆమె గర్భంతో ఉండడంతో పిండం కూడా బయటకొచ్చేసింది.
జిల్లెలగూడలో మరో క్రూరత్వం..
యూ ట్యూబ్‌లో హర్రర్, క్రైమ్ చూసి భార్యను అత్యంత కర్కశంగా చంపేశాడు. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన వెంకటమాధవి (35) హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. వెంకటమాధవికి, గురుమూర్తికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. ఆర్మీలో పనిచేసిన గురుమూర్తి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో కొద్ది రోజులుగా ఆమెతో గొడవపడుతున్నాడు. ఈనెల 13న కూడా ఆమెతో గొడవపడి, మటన్ కత్తితో పొడిచి చంపేశాడు. భార్య కనిపించడం లేదని అత్తతో కలిసి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురుమూర్తిపై అనుమానంతో తమదైన శైలిలో విచారణ చేపట్టగా, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను గురుమూర్తే చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు దర్యాప్తులో తేలింది. యూట్యూబ్ (YouTube)లో హర్రర్, క్రైమ్ చిత్రాలు చూసిన గురుమూర్తి సంక్రాంతి సెలవుల్లో భార్య మాధవిని మటన్ కత్తితో ముక్కులగా నరికి కుక్కర్ లో ఉడకబెట్టాడు. ఎముకలను కాల్చి దంచి పొడిచేశాడు. ఈ ఘటనతో గురుమూర్తి నివాసం ఉండే జిల్లెలగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలో భయాందోళన నెలకొంది. వారు ఉంటున్న భవనంలోని నివాసితులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంకో విషయం ఏంటంటే.. భార్యను చంపడానికి ముందు అతడు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపినట్లు తెలుస్తోంది.
నిజంగా చంపాడా..? దాచి పెట్టాడా?
అయితే.. మీర్ హత్య కేసులో పోలీసులకు మరో కొత్త అనుమానం మొదలైనట్లు తెలుస్తోంది. భార్యను ముక్కలుగా కోయడం.. ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించకుండా క్లీన్ చేయటం, శరీర భాగాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టడం, చెరువులో విసిరేయటం.. ఇదంతా ఒక్కడి వల్లే సాధ్యం కాదని భావిస్తున్నారు. అంత ఘోరంగా చంపేసినా ఏమాత్రం ఆనవాళ్లు ఇంట్లో కానీ.., జిల్లెలగూడ చెరువు సమీపంలో కానీ పోలీసులకు కనిపించలేదని తెలిసింది. గురుమూర్తి నిజంగానే భార్యను కిరాతకంగా హత్య చేశాడా..? లేక ఆమెను ఎక్కడైనా దాచి ఉంచాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
…………………………………………………….