* ఏపీలో తీవ్రమైన చర్చ
* కూటమి ఘన విజయంలో జనసేనాని కీలకం
* ఆ పార్టీకి కేటాయించబోయే పదవులపై ఆసక్తి
* హోం మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అంటున్న అభిమానులు
* పర్యావరణ, రైతులు, వ్యవసాయంపై ఇంట్రెస్ట్ అంటున్న పవన్
ఆకేరు న్యూస్, విజయవాడ :
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా గుర్తింపు పొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు ఏ పదవి లభిస్తుందో అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించడంలో పవన్ పాత్ర కీలకం అన్నది అందరూ ఆమోదిస్తున్న విషయం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సైతం ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయనకు అభినందనలు తెలిపారు. అలాంటి నేతకు ఎటువంటి పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. జనసేనానికి కేటాయించబోయే పదవిపై ఏపీనే కాదు.. జనసేనే కాదు.., ఇతర రాష్ట్రాలు, ఇతర పార్టీలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
తగ్గి.. నెగ్గారు..
పొత్తులో భాగంగా పవన్‌కల్యాణ్ కేవలం 21 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఎంపీ సీట్లూ రెండే. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామని కాదు, ఎన్ని గెలిచామో ముఖ్యమని మొదటి నుంచీ చెబుతున్న పవన్.. పొత్తు ధర్మానికి కట్టుబడి అన్నింటికీ అంగీకరించారు. తగ్గి.. నెగ్గారు. ఎన్నికల ఫలితాల్లో నూటికి నూరు శాతం విజయం నమోదు చేసుకున్నారు. జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు అందరినీ గెలిపించుకున్నారు. సినిమాల్లో పవర్ స్టార్‌గా ఉన్న పవన్.. పొలిటికల్గాను పవర్ ఫుల్ స్టార్‌గా మారారు. పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది దేశంలోనే రికార్డు సృష్టించారు. భారతదేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని ఒక సభలో ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆ మాటను నిజం చేసి చూపించారు.
కచ్చితంగా అధికారంలో భాగస్వామ్యం
ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అటు కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించనుంది. కేంద్రం సంగతి అటుంచితే.. రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేటాయించబోయే పదవి ఏంటనేది తేలాల్సి ఉంది. నిన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేంద్ర కార్యాలయంలో సమావేశమైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పారు. ఈనేపథ్యంలో పవన్ పదవిపై మరింత ఉత్కంఠ ఏర్పడింది.
హోం మినిస్టర్..
తన వల్లే ఇంతటి విజయం వచ్చిందని అందరూ పొగుడుతున్నా పవన్ పొంగిపోవడం లేదు. ఇది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం అని శ్రేణులకు నూరిపోస్తున్నారు. అయితే.. పవన్ అభిమానులు ఆయనను హోం మినిస్టర్గాను, ఉప ముఖ్యమంత్రిగాను చూడాలని కోరుకుంటున్నారు. ‘సీఎం చాన్స్ లేదు కాబట్టి.. నా వరకైతే పవన్‌కల్యాణ్ గారు హోం మినిస్టర్‌గా ఉంటే వ్యవస్థ క్రమశిక్షణతో ఉంటుంది. మహిళలకు, యువతులకు రక్షణ పెరుగుతుంది. సంఘ విద్రోహులకు భయం ఏర్పడుతుంది.’ అన్నారు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త, పవన్ వీరాభిమాని సియ్యాదుల శ్రీమాన్ నారాయణ. అలాగే.. ఉపముఖ్యమంత్రి పదవి కూడా కేటాయించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం శ్రీమాన్ మితృబృందం కూడా విస్తృతంగా పనిచేసింది.
వీటిపై పవన్ కు ఇంట్రెస్ట్ అట..
జనసేనానికి హోంశాఖ వస్తుందని కేడర్ ఆశిస్తున్న తరుణంలో దీనిపై పవన్‌కల్యాణ్ స్పందించారు. తనకు కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణపై పని చేయాలని ఉందని ఢిల్లీలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే, వ్యవసాయం, రైతులకు సంబంధించిన ఇరిగేషన్ ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చారు. ఈవ్యాఖ్యలు మరింత ఉత్కంఠను రేకెత్తించాయి. అంతిమంగా పవన్ ఏ పదవిని అధిరోహిస్తారో చూడాలి. పదవి ఏదైనా దానికి పవన్ న్యాయం చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
—————————