
ఆకేరు న్యూస్, జనగామః దేవరుప్పుల మండలం మాదాపురం వానకొండయ్య గుట్టను ఎలా అభివృద్ధి చేస్తారు.. ఏమేమి అభివృద్ధి చేస్తారు.. నిధులు ఎన్ని.. పాతవి ఎన్ని.. కొత్తవి ఎన్ని.. గోపురం కడుతారా.. సీసీ రోడ్డు వేస్తారా.. లేక గుడి కడతారా.. ఏమి పనులు చేస్తారో ప్రజలకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి క్లారిటీ ఇవ్వాలని బీ ఆర్ ఎస్ జనగామ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం దేవరుప్పుల మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు తీగల దయాకర్, మాజీ ఎంపిపి బస్వ సావిత్రి మల్లేశం, ప్రధాన కార్యదర్శి చింత రవితో కలిసి మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు మంత్రిగా ఉన్న దయాకర్రావు వానకొండయ్య గుట్ట అభివృద్ధికి కోటి రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఇప్పుడు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అదే గుట్ట అభివృద్ధికి కోటి రూపాయలను మంజూరు చేయించానని ప్రకటించారు. దేవాలయం అభివృద్ధికి కోటి నిధులు మంజూరు చేయించడం మంచిదే. కాకుంటే ఈ నిధులు గతంలోనివా.. లేక ఇప్పుడు కొత్తగా మంజూరు చేయించారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మంజూరు అయిన కోటి, ఇప్పుడు ఎమ్మెల్యే మంజూరు చేయించిన కోటితో రెండు కోట్లతో దేవాలయం అభివృద్ధి మరింత జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి దేవాలయం అభివృద్ధికి మంత్రిగా ఉన్నప్పుడే దయాకర్రావు నిధులు మంజూరు చేయించారు. ఇప్పుడు అదే నిధులకు కొత్త జీవోను ఇప్పించి, తాను మంజూరు చేయించానని చెప్పడం అంటే ప్రజలను మోసం చేయడం, మభ్య పెట్టడమే అని అన్నారు. గతంలో మంజూరు అయిన అనేక పనులకు ఇప్పుడు మళ్ళీ నిధులు మంజూరు అయ్యాయని చెప్పడం హాస్వాస్పదంగా ఉందన్నారు.
……………………………………………..