*బాలికలకు వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇప్పించాలి..మేయర్ గుండు సుధారాణి
ఆకేరు న్యూస్ ,హనుమకొండ : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇప్పించాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు.
ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, హనుమకొండలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందజేసి, వ్యాక్సినేషన్ ధృవపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పేద కుటుంబాల బాలికలకు ఉచితంగా అందించడం ఎంతో శ్లాఘనీయమన్నారు. తల్లుల కమిటీలు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా సంఘాలు, కార్పొరేషన్ సిబ్బంది గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు అవగాహనతో ముందుకు వచ్చి తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించడం అభినందనీయమన్నారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు తల్లిదండ్రుల అనుమతి పత్రాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, హనుమకొండ మరియు పరకాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, దశలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా విస్తరించనున్నట్లు చెప్పారు. 2006 నుంచే ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉందని, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ. అప్పయ్య మాట్లాడుతూ జిల్లాలో 7,000 మందికి పైగా బాలికలను గుర్తించినట్లు తెలిపారు. ఎలాంటి అపోహలకు లోనవకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
మొదటి రోజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, హనుమకొండలో 17 మంది బాలికలకు, పరకాలలో 12 మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ. అప్పయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ డాక్టర్ మంజుల, డీటీసీఓ డాక్టర్ హిమబిందు, ఇంచార్జ్ డీఐఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మానస రెడ్డి, డాక్టర్ అనిల్, డాక్టర్ గీత, డెమో వి. అశోక్ రెడ్డి, హెచ్ఈఓ చంద్రశేఖర్, జీఎంహెచ్ మరియు పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
——–
