* అభ్యర్థులు భారీగా ఉండే చాన్స్
* బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు!
* ఆసక్తికరంగా ఉప ఎన్నిక
* రేపు తేలనున్న అసలైన లెక్క
* అధికార పార్టీకి పెద్ద పరీక్షే!!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి
తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజామాబాద్ ఎంపీ ఎన్నికలను గుర్తుచేస్తోంది. నాడు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పై కోపంతో అప్పటి సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను ఎన్నికల్లో ఓడించారు. పసుపు రైతులు, ఇతర వర్గాలు ఎన్నికల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేలా చేశారు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న రెండో ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ లో కూడా అదే సీను కనిపిస్తోంది. అధికార పార్టీపై కోపంతో చాలా మంది నిరుద్యోగులు, పలువురు రైతులు, మాల సంఘాల నేతలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. ఆ పార్టీని ఓడిస్తామని శపథం చేస్తున్నారు. మరి ఏం జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 321 నామినేషన్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లను వేశారు. చివరి రోజు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన వారికే టోకెన్లు ఇచ్చి నామినేషన్లను స్వీకరించారు. 13వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో మొదటి రోజు 11 మంది 22 నామినేషన్లు దాఖలు చేయగా.. 18వ తేదీ వరకు మొత్తం 127 నామినేషన్లు దాఖలయ్యాయి. 22న చివరిరోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు చేశారు. ఆది, సోమవారం సెలవు కావడం, మంగళవారం ఒక్కరోజే అవకాశం ఉండటంతో అభ్యర్థులు భారీఎత్తున తరలివచ్చారు. అభ్యర్థులతోపాటు వారిని బలపరిచేందుకు వచ్చిన వారితో ఎన్నికల అధికారి కార్యాలయం ఆవరణ ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా కిటకిటలాడింది. నామినేషన్లను పరిశీలించే క్రమంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లపై ఇరువైపులా కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బిఆర్ఎస్ నుంచి మాగంటి సునీత నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు.
ఎంత మంది బరిలో నిలవనున్నారో..
నామినేషన్లను స్క్రూటినీ అనంతరం కొంతమంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పలు కారణాలతో తిరస్కరించారు. కాగా 24న నామినేషన్ల విత్ డ్రాకు తుది గడువు కావడంతో ఎంత మంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారు, ఎంత మంది బరిలో ఉంటారనే ఆసక్తి ఏర్పడింది. 321 నామినేషన్లు వచ్చిన నేపథ్యంలో కనీసం 150 మంది వరకు పోటీలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య గరిష్టంగా 64 దాటితే బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత సీన్ చూస్తే జూబ్లీహిల్స్ లో అదే జరుగుతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే నిరుద్యోగులు, త్రిఫుల్ ఆర్ బాధిత రైతులు, మాల సంఘాల నేతలు నామినేషన్లు వేశారు. వారిలో చాలా మంది పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో కనీసం 150 మంది పోటీలో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలా అయితే అధికార పార్టీ కాంగ్రెస్ కు అది పెద్ద సవాలుగానే మారనుంది.
