* కొత్త పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్
* విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
* అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా విజయ్‌కుమార్
* పోలీస్ పర్సనల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా మహేష్ భగవత్
* పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేష్‌కు అదనపు బాధ్యతలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయినారు. శ్రీనివాస రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్‌గా నియమించారు. వీరితో పాటు మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను సైతం బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా విజయ్‌కుమార్. పోలీస్ పర్సనల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా మహేష్ భగవత్, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
* శ్రీనివాస రెడ్డి బదిలీ ఎందుకు..?
సమర్థుడైన అధికారిగా పేరున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అకస్మిక బదిలీ చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త కోట శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్ సీపీగా నియమించారు. ఏడాది లోపే ఆయనను బదిలీ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటున్నారు హైదరాబాద్ నగర వాసులు. శ్రీనివాస రెడ్డి హయాంలో హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు కూడా తలెత్త లేదు. మరి ఆకస్మికంగా బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి బదిలీ చేశారా..? బదిలీ జరగడం వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న చర్చ జరుగుతోంది. కాగా, వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ లాంటి పండుగలు ఉండడంతో మత పరమైన అల్లర్లు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగానే అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన అనుభవం సీవీ ఆనంద్‌కు ఉంది. ఆనంద్ హైదరాబాద్ కమిషనర్‌గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ లాంటి పండుగలను విజయవంతంగా నిర్వహించారు. ఆ అనుభవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు కూడా వినియోగించుకోవాలన్న ఆలోచనతో సీవీ ఆనంద్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించారన్న చర్చ కూడా లేక పోలేదు.
—————————————-