Hyderabad Love Murder
* హైదరాబాద్ లో వరుస ఘటనలతో కలకలం
* ప్రేమ ముసుగులో ఘోరాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : హైదరాబాద్ నగరంలో ప్రేమ పేరుతో మోసాలు, ఆపై జరుగుతున్న దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమ్మాయిలను నమ్మించి లోబరుచుకోవడం, పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి కడతేర్చడం పరిపాటిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు విగతజీవులుగా మారుతుండటంతో తల్లిదండ్రులు గుండెలు పగిలి రోదిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుస ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
* నమ్మించి ఆపై..
చదువులు, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వస్తున్న కొందరు యువతుల జీవితాల్లో కొద్దికాలంగా విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అందమైన మాటలతో వలలో వేసుకోవడం, నమ్మకం కలిగించి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని నమ్మించడం.. ఆపై పెళ్లి లేదా బాధ్యతల పేరు చెప్పగానే రాక్షసులుగా మారడం నేటి సమాజంలో ఆందోళనకర పరిణామంగా మారుతోంది.
* 9 రోజుల వ్యవధిలో ముగ్గురు
చదువు, ఉద్యోగాల నిమిత్తం స్వగ్రామాలను వదిలి నగరానికి వస్తున్న యువతులు కొందరి మాయమాటలకు బలవుతున్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళలు దారుణ హత్యలకు గురికావడం భాగ్యనగరంలో తీవ్ర కలకలం రేపింది. మాదాపూర్, ఎస్సార్‌నగర్, మియాపూర్ ప్రాంతాల్లో జరిగిన ఈ దారుణ ఘటనలు కేవలం వ్యక్తిగత హత్యలు కావు, సమాజంలో పెరుగుతున్న సైకోయిజానికి, నైతికత పతనానికి నిదర్శనాలు.
* మియాపూర్ లో వైద్య విద్యార్థిని హత్య
మియాపూర్‌లోని ఒక హోటల్లో వైద్య పీజీ విద్యార్ధిని దారుణ హత్యకు గురైన ఘటన అక్టోబర్ 1న వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో పరిచయం అయిన యువకుడితో మృతురాలికి పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ఇద్దరూ ఇటీవల విడిపోయారు. అయితే ఇద్దరూ స్నేహితులుగా ఉన్నప్పుడు ఇచ్చిన బంగారు గొలుసు తిరిగి ఇచ్చేయాలని ఆ యువతి కోరింది.
దాంతో అప్పటికే తనను దూరం పెట్టిందని కక్షపెంచుకున్న యువకుడు.. ఇదే అదునుగా భావించి మియాపూర్ పరిధిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకొని ఆ యువతిని అక్కడికి పిలిచాడు. అదే రోజు యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు రవి అక్కడి నుంచి పరారయ్యాడు.
* ఆమె కోసం విశాఖ నుంచి హైదరాబాద్ కు..
సెప్టెంబరు 22న నగరంలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న యువతిని విశాఖపట్నంకు చెందిన యువకుడు ప్రేమించాడు. అమెను కలుసుకునేందుకు విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన యువకుడు ఆమెను మాదాపూర్ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో వాగ్వాదం జరిగింది. దాంతో శ్రీనివాస్ కోపోద్రిక్తుడై ఆ యువతిపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఏమీ తెలియనట్లు హోటల్ సిబ్బంది సహకారంతో ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితున్ని నాలుగు రోజుల క్రితం అరెస్టు చేశారు.
* ఎస్ఆర్నగర్లోని లాడ్జిలో..
సెప్టెంబరు 29న ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో ఇటీవల మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రేమ పెళ్లి పేరుతో వంచించిన శ్రీనివాస్ అనే యువకుడు ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. పెళ్లి విషయంపై ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
* హోటళ్లు, లాడ్జిలే అడ్డాగా..
ప్రేమ పేరుతో నేరాలు, ఘోరాలకు పాల్పడడానికి హోటళ్లు, లాడ్జిలు, ఓయో రూమ్‌లను ఎంచుకుంటుండటం గమనార్హం. ఎవరి కంట పడకుండా, ఎటువంటి ఆధారాలు దొరక్కుండా ముందుగానే ప్రణాళిక రచించి మరీ ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. మాట్లాడుకుందామనే నెపంతో నిర్జన ప్రాంతాలకు లేదా ప్రైవేట్ గదులకు రప్పించి, క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్న తీరు పోలీసులకూ సవాల్‌గా మారుతోంది.
* నిఘా పెంపు..
వరుస ఘటనల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జిలపై పోలీసులు నిఘా పెంచారు. లాడ్జిలు, హోటళ్ల నిర్వహణపై పోలీసులు మరింత కఠినమైన ఆంక్షలకు సిద్ధమవుతున్నారు. ఐడీ ప్రూఫ్స్ లేకుండా గదులు ఇవ్వడం, యువతీ యువకుల రాకపోకలపై సీసీటీవీ నిఘా లేకపోతే చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, ముఖ్యంగా కాలేజీలు, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే యువతులతో తల్లిదండ్రులు నిత్యం టచ్‌లో ఉండాలని సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
