ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ట్రాన్స్జెండర్లకు పునరావాసం, స్వయం ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ట్రాన్స్‌జెండర్ ఆర్థిక పునరావాస పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కార్యాచరణ ప్రణాళికను ఆమోదించి 100 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి యూనిట్లు కల్పిస్తున్నట్లు చెప్పారు. పథకం కింద హైదరాబాద్ జిల్లాకు మొత్తం 30 స్వయం ఉపాధి యూనిట్లు కేటాయించారని, ప్రతీ యూనిట్‌కు రూ.75,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం రూ.22,50,000 వ్యయంతో 30 మందిని ఎంపిక చేసి యూనిట్లు అందిస్తామని, పథకానికి హైదరాబాద్ జిల్లా పరిధిలో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తామని, అభ్యర్థులు తమ ప్రతిపాదిత జీవనోపాధి యూనిట్ల వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను జనవరి 31లోపు అందజేయాలన్నారు. పథకం మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను జిల్లాస్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత మంజూరు ఉత్తర్వులు జారీ చేసి స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. దరఖాస్తు పత్రాన్ని www.wdsc.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే నాంపల్లి అజంతా గేట్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యక్షంగా పత్రాన్ని పొంది పూర్తి చేసి అందించవచ్చన్నారు.
………………………………………….

