* నా తండ్రి దేవుడే.. అన్న, వినయ్ వల్ల మారిపోయాడు
* మద్యానికి బానిసయ్యానని ఆరోపణలు చేయడం అన్యాయం
* మీడియాతో మంచు మనోజ్
* సీపీ కార్యాలయానికి పయనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంచు మోహన్‌బాబు(Manchu Mohanbabu) కుటుంబంలో మంటలు రోజురోజుకూ ఉధృతం అవుతున్నాయి. నిన్న రాత్రి ఏకంగా ఒకరిపైమరొకరు దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలి(Gachibowli)లోని ఓ ఆస్పత్రిలో మోహన్‌బాబు చికిత్స పొందుతున్నారు. కాగా, బుధవారం ఉదయం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి రోజు వస్తోందని తాను ఏనాడూ ఊహించలేదన్నారు. తన భార్య ఏడు నెలల గర్భవతి ఉన్న సమయంలో బాధలు అనుభవించిందని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన బంధువులపై దాడి చేశారని ఆయన తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఆగాను, ఇక ఆగలేనని ఆయన చెప్పారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. అన్ని విషయాలు సాయంత్రం చెబుతానని ఆయన మీడియాకు తెలిపారు. తన తండ్రి దేవుడని, అన్న, వినయ్(Vinay) వల్ల మారాడాని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితం మినహా తాను ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ సంతకాలు పెట్టాలంటే అక్కడ పెట్టానని, ఎన్ని సినిమాలు చేయాలంటే అన్ని సినిమాలు చేశానని వెల్లడించారు. తాను మద్యానికి బానిసగా మారి దాడి చేశానని ఆరోపణలు చేయడం అన్యాయం అన్నారు. సీసీటీవీ ఫుటేజీలు బయటపెడితే ఎవరు ఏం చేశారో తెలుస్తుందని మనోజ్(Manoj) చెప్పారు. వేరొకరి కడుపు కొట్టి తన కడుపు నింపుకునే రకం కాదన్నారు. తన వ్యక్తిగత జీవితానికి ఇబ్బండి పెడుతున్నారని తెలిపారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదిస్తున్నాం.., ఆస్తుల కోసం గొడవ పడడం లేదని మనోజ్ తెలిపారు. కాగా సీపీ ఆదేశాల మేరకు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
…………………………..