* సెక్యూరిటీ లేకుండా మూసీ వద్దకు పోదాం..
* సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్
* మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు..
* పేదల ఇళ్లను కూలగొట్టడాన్నే వ్యతిరేకిస్తున్నాం..
* మూసీ సుందరీకరణ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం
* నిర్మాణాత్మకం మానేసి.. విధ్వంసకర పనులు చేస్తున్నారు..
* ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఇల్లు కూడా మూసీ బఫర్లోనే ఉంది..
* మూడు నెలలు కాదు.. నాలుగు నెలలు అక్కడే ఉంటా
* రేవంత్ సవాలును స్వీకరించిన హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేపు ఉదయం 9 గంటలకు నీ ఇంటికి వస్తానని, ఇద్దరమూ సెక్యూరిటీ లేకుండా కారులో మూసీ వద్దకు పోదామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఒకవేళ బిజీగా ఉంటే ఎల్లుండు వెళ్దామో, ఎప్పుడో మీరే టైం చెప్పాలని సూచించారు. మూసీ సుందరీకరణకు అడ్డు పడుతున్నారని, దమ్ముంటే మూడు నెలలు మూసీ వద్ద పడుకోవాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, బీఆర్ ఎస్ హయాంలోనే అందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదల ఇళ్లను కూలగొట్టడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు. నిర్మాణాత్మకం మానేసి.. విధ్వంసకర పనులు చేస్తున్నారని అన్నారు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఇల్లు కూడా మూసీ బఫర్లోనే..
తనకు తెలిసి ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఇల్లు కూడా మూసీ బఫర్ జోన్లోనే ఉందని, పబ్లిక్ కమిషన్ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇళ్లు కూడా అక్కడు ఉన్నాయని తెలిపారు. తాను ఉద్యమకారుడినని పది వేల కుటుంబాలకు మేలు జరుగుతుందంటే మూడు నెలలు కాదు.. నాలుగు నెలలైనీ మూసీ వద్దే ఉంటానని హరీశ్‌రావు వెల్లడించారు. రేవంత్ అసలు పని వదిలి పెట్టి.. పేదల ఇళ్లు కూలగొడతా అనడం సరికాదన్నారు. నదిలోకి నీళ్లు వచ్చి చేరే క్యాచ్ మెంట్ ఏరియాను రీస్టోర్ చేసే పని మొదలు కావాలన్నారు.
శత్రుదేశాలపై దాడులు చేసినట్లుగా..
శని, ఆదివారాలు చూసుకుని, కోర్టులు సెలవులు ఉన్నప్పుడు.. శత్రు దేశాలపై దాడి చేస్తున్నట్లుగా పేదల ఇళ్లను కూలుస్తున్నారని రేవంత్‌పై మండిపడ్డారు. లక్షా యాభై వేల కోట్లతో మూసీ పరివాహక అభివృద్ధి కోసం అన్నది రేవంతే కదా.. అని ప్రశ్నించారు. సీఎం దిగజారి మాట్లాడుతున్నారని, నిన్నటి సీఎం మాటలతో అబద్దమే ఆశ్చర్యపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని, వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే మూసీని తెరపైకి తెచ్చారని తెలిపారు. కనీస అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని, తాము 4వేల ఇళ్లు కట్టామని వివరించారు. మెగాస్టార్.. సూపర్ స్టార్లు కూడా ముక్కున వేలేసుకునేలా రేవంత్ నటన ఉందన్నారు.
…………………………………………………………..