iBomma Piracy Website Return
*వదల బొమ్మాళి ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది
*రవి బెయిల్.. ఇండస్ట్రీకి షాక్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా వేధిస్తున్న పైరసీ సమస్య మళ్లీ ముదిరింది. గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. ఆయన విడుదలైన కొద్ది రోజుల్లోనే ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్సైట్ సరికొత్తగా ఆన్లైన్లో ప్రత్యక్షమవ్వడం సినీ వర్గాలను షాక్కు గురి చేస్తోంది.
*ఇమ్మడి రవి విడుదల
పైరసీ నెట్వర్క్ను నడుపుతున్నాడనే ఆరోపణలతో అరెస్టయిన ఇమ్మడి రవి, ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు. ఆయన విడుదల కావడమే ఆలస్యం అన్నట్లుగా, నిలిచిపోయిన వెబ్సైట్ మళ్లీ యాక్టివ్గా మారింది. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
*నెటిజన్ల ఆశ్చర్యం
కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కేవలం కొన్ని గంటల్లోనే అత్యంత నాణ్యమైన ప్రింట్లను వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడం ఐబొమ్మ ప్రత్యేకతగా మారింది. “ఇంత వేగంగా సినిమాలు ఎలా అప్లోడ్ అవుతున్నాయి?” అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
*సినీ పరిశ్రమపై ప్రభావం
కోట్లాది రూపాయల బడ్జెట్తో నిర్మించిన సినిమాలు విడుదలైన వెంటనే ఉచితంగా ఇంటర్నెట్లో లభించడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ పైరసీ భూతాన్ని అరికట్టేందుకు సైబర్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, డొమైన్ పేర్లు మారుస్తూ ఈ ముఠా తన కార్యకలాపాలను సాగిస్తోంది.
పైరసీ అనేది చట్టవిరుద్ధమైన చర్య. ఇమ్మడి రవి విడుదల తర్వాత వెబ్సైట్ పునరాగమనం పరిశ్రమకు ఒక పెద్ద సవాలుగా మారింది. దీనిపై కఠినమైన చట్టాలు అమలు చేయాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.
