
* భారీ వర్షం వస్తే బెంబేలెత్తుతున్న హైదరాబాద్ మహానగరం
* కాలనీలు, బస్తీలు జలమయం
* చెరువుల్లా రహదారులు
* వాన ఎక్కువైతే కొట్టుకుపోతున్న వాహనాలు
* ముంపు ముప్పునకు కారణాలెన్నో
* ఇప్పటికైనా నివారణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదమే అంటున్న నిపుణులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
విద్యుత్ ధగధగలు.. విశాలమైన రహదారులతో రోజూ విశ్వనగరంలా వెలుగులు విరజిమ్మే హైదరాబాద్ మహానగరం.. నిన్న కురిసిన భారీ వర్షానికి వణికిపోయింది. ధగధగలు మాయమై చీకట్లు కమ్ముకున్నాయి. విశాలమైన రహదారులు సముద్రాన్ని తలపించాయి. వరద నీటి ప్రవాహానికి బైకులే కాదు.., కొన్నిచోట్ల కార్లూ కొట్టుకుపోయాయి. వాణిజ్యపరంగా ప్రధాన ప్రాంతమైన అమీర్ పేట 10 సెంటిమీటర్ల వానకు స్వరూపం మొత్తం మారిపోయింది. ప్రధానరోడ్డులో కనుచూపు మేర ఎటుచూసినా వరద నీటి ప్రవాహమే కనిపించింది. ఇప్పుడే కాదు.. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా ఈ ప్రాంతం ఇలాగే నీట మునిగింది. ఇందుకు గల కారణాలను అన్వేషించి.. నివారణ చర్యలు చేపట్టకపోతే మహా ఉపద్రవం తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.
ముంపునకు కారణాలేంటంటే..
వాన కురిస్తే భూమిలోకి ఇంకే పరిస్థితి మహానగరంలోని చాలా ప్రాంతాల్లో కనిపించదు. రోడ్డుకు అనివైపులా సిమెంటు పూతలు, ఫుట్ పాత్ లను ఆనుకునే వరకూ రోడ్డు నిర్మాణంతో వర్షం నీరు ఇంకే పరిస్థితి చాలాచోట్ల లేదు. దీంతో వరద రోడ్లపైనే ప్రవహిసూ ఉంటోంది. అలాగే నాలాలు, కుంటలు కబ్జాలు మరో కారణం. నిన్ననే కాదు.. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి అమీర్ పేట అంతలా మునిగిపోవడానికి కారణాలను అన్వేషిస్తే ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అమీర్ పేట వద్ద వరద ముంపునకు నాలాల ఆక్రమణే ప్రధాన కారణమని హైడ్రా తేల్చింది. ఎగువ ప్రాంతాల్లో 40 అడుగుల వెడల్పు ఉన్న నాలా.. అమీర్‌పేట – సంజీవరెడ్డి నగర్ దాటే చోట 10 అడుగులు మాత్రమే ఉంది. దీనివల్ల జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడ, మధురానగర్ శ్రీనివాస్ నగర్ వెస్ట్ ప్రాంతాల నుంచి వస్తున్న వరద అమీర్ పేటను ముంచెత్తింది. రోడ్డుపైన మూడు, నాలుగు అడుగులు మేర వరద నిలిచింది. నిన్నటి పరిస్థితికి కూడా అదే కారణంగా హైడ్రా నిర్ధారించింది.
ఈ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం
భారీ వర్షాలు కురిసినప్పుడు కొన్ని ప్రాంతాలపై పెను ప్రభావం పడుతోంది. వరద పొంగిపొర్లుతోంది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు దీరుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సెల్లార్లు, ఇళ్లలోకి చేరిన వరదనీరు చేరింది. అమీర్‌పేట, కృష్ణానగర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఐటీ కారిడార్‌లో రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, మెహిదీపట్నం, లంగర్‌హౌస్, బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్, సైబర్ టవర్స్,హైటెక్ సిటీ, కెపీహెచ్బీ కాలనీ, శేరిలింగంపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జి, మదీనాగూడ, హైటెక్ సిటీ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36, రోడ్ నంబర్ 70, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఆసిఫాబాద్, సైఫాబాద్ ప్రాంతాలపై ఎక్కువగా ప్రభావం ఉంటోంది. వర్షం వచ్చిన ప్రతీసారి ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోతుండడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో గంటల కొద్దీ సగటు నగర వాసి నరకం అనుభవిస్తున్నాడు.
ఈ చర్యలు చేపట్టకపోతే..?
ఇప్పటికైనా నివారణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్ కు మున్ముందు మరింత ప్రమాదం పొంచి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైడ్రాకు పూర్తి అధికారాలు అప్పగించి నాలా నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్న నిర్మాణాలను తొలగించాల్సిందేనని సూచించారు. ఎక్కడెక్కడ నాలాలు కుదించుకుపోయే వెడల్పునకు చర్యలు చేపట్టాలి. ఆక్రమణల తొలగింపులో ఎక్కువ మందికి ఇబ్బందులు తలెత్తుతాయంటే.. నాలాల లోతు పెంచడంపై దృష్టి సారించాలి. అలాగే, ప్రధాన రహదారుల్లో వర్షం నిలిచిపోకుండా ఇప్పటికే ప్రారంభించిన అండర్ గ్రౌండ్ నీటి సంపులను పెంచాల్సి ఉంది. నీరు భూమిలోకి ఇంకేలా నిర్మాణ స్వరూపం మార్చాల్సిన అవసరం ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎక్కువ ప్రభావితం అవుతున్న ప్రాంతాలపై ఇంజనీరింగ్ బృందాలతో అధ్యయనం చేయించి వరద నీరు నిలిచిపోవడానికి కారణాలను పూర్తిగా తెలుసుకోవాలి. నివారణ మార్గాలను అన్వేషించాలని నిపుణులు సూచిస్తున్నారు.
………………………………………