* వెలగపూడిలో దీక్షా శిబిరాలు తొలగింపు
* 1631 రోజులపాటు సాగిన దీక్ష
ఆకేరు న్యూస్, విజయవాడ : వంద.. రెండొందలు కాదు.. ఏకంగా 1600 రోజులకుపైగా దీక్షలు చేశారు ఆ రైతులు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ.. గొంతెత్తి నినదించారు. ఊరూరా తిరిగారు. తమకు అండగా ఉండాలంటూ ప్రతి ఒక్కరినీ అభ్యర్థించేవారు. మూడు రాజధానులు అంటూ గత వైసీపీ ప్రభుత్వం మూడుముక్కలాట ఆడడంతో గత్యంతరం లేక రైతులు దీక్షలు మొదలుపెట్టారు. జూన్ 12న బుధవారం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి.. రాష్ట్రం విడిపోయాక రెండో సారి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. మూడు రాజధానులు అంటూ ఇక ఆటలుండవు.. అమరావతే ఏకైక రాజధాని అని ప్రకటించడంతో అక్కడి రైతులు తమ దీక్షలను విరమించారు. అమరావతికి పునర్వైభవం వచ్చే పరిస్థితి తిరిగి రావడంతో వెలగపూడిలో దీక్షా శిబిరాలను తొలగించారు.
ఎక్కడికక్కడ దీక్షా శిబిరాలు
గత వైఎస్సార్సీపీ ( YSRCP) ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులు అని ప్రకటన చేసినప్పటి నుంచీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని కోసం 2014లో 30 వేల ఎకరాలను ఇచ్చిన అమరావతి రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. అమరావతి (Amaravati) ని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వెలగపూడి తదితర ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా 1631 రోజులు పాటు రైతులు (Farmers) దీక్షలు చేశారు. అయినా అమరావతి రైతుల దీక్షలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే తాజాగా జరిగిన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఘోరమైన ఓటమిని చవి చూసింది.
ఊపిరి పీల్చుకున్న అమరావతి రైతులు
ఇదే ఎన్నికలలో కూటమి భారీ మెజార్టీని సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం తాము అమరావతి (Amaravati)ని ఏకైక రాజధాని (Capital) అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావటంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఇక అమరావతి ఒక్కటే రాజధాని అంటూ ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగానే.. వెలగపూడిలో ఇప్పటి వరకూ ఏర్పాటు చేసిన తమ దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్లు అమరావతి రైతులు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకం తమకు ఉందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
———————-