Hanamkonda
Hanamkonda| ఆకేరు న్యూస్, హనుమకొండ: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉందని INDIA కూటమి నేతలు అన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని, ఓటు హక్కును కాపాడేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో హనుమకొండ DCC అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన INDIA కూటమి పార్టీల సంయుక్త విలేకరుల సమావేశం శనివారం జరిగింది. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘ప్రజాస్వామ్య పరిరక్షణ వారం’లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని వీడి స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు.
5న భారీ పాదయాత్ర
ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 5న హనుమకొండలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. డా. బీఆర్ అంబేద్కర్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమం ముగింపులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను బహిరంగంగా చదివి వినిపించనున్నట్లు వెల్లడించారు.
యువజన, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, అనుబంధ సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
మండలాల వారీగా సమావేశాలు
అక్టోబర్ 6 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని మండలాలు, పట్టణాలు, డివిజన్ల వారీగా INDIA కూటమి పార్టీలతో సంయుక్త సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను సమీకరించి, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సమావేశంలో CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, CPM జిల్లా కార్యదర్శి జీ. ప్రభాకర్ రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు, TJS అధ్యక్షుడు చిల్లా రాజేంద్ర ప్రసాద్, CPI జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ దుద్దిల్ల శ్రీనుబాబు, DCC మీడియా అండ్ కమ్యూనికేషన్ కమిటీ ఛైర్మన్ మార్క విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
