* ఇందిరమ్మ చీరల పంపిణీలో
మానకొండూర్ ఎంఎల్ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ఆకేరు న్యూస్, కరీంనగర్ :
తెలంగాణాలోని ఆడ పడుచులకు సీఎం రేవంత్ రెడ్డి సారె అందిస్తున్నారని.. అందులో భాగంగా ఇంటింటికి ఇందిరమ్మ చీర అందిస్తున్నామని మానకొండూర్ ఎంఎల్ ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రం వెలుగు మండల సమాఖ్య ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ మాట్లాడారు. మహిళల అభివృద్ధి కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా మహిళలకు ఉద్దేశించిన అనేక పథకాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నదని, చెప్పారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్తుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిందని, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, సొంత ఇల్లు లేని మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నదని ఆయన విమరించారు. ఇందిరమ్మ పిల్ల లబ్ధిదారులుగా ఎంపికైన మహిళా గ్రూప్ సభ్యులకు ఆ గ్రూపుల ద్వారా రెండు లక్షల రూపాయల మేరకు రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు.కోటి మంది స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలని, పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలనే తలంపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. మహిళలు అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలువాలన్నదే ప్రభుత్వం సంకల్పమన్నారు. అందుకే మహిళలకు ఆర్థికాభివృద్ధికి, వారి ఉన్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మూడు పర్యాయాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ల పేరిట నిరుపేదలను బీఆర్ఎస్ సర్కార్ వంచించిందని ఆయన విమర్శించారు.ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింట కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తున్నదన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పాలకులకు మనసు రాలేదని, కనీసం కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా చేయించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా పారదర్శకంగా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉప మఖ్యకార్యనిర్వహణాధికారి టి.పవన్ కుమార్, మండల అభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్, తహసీల్దార్ సురేఖ, పీడీ శ్రీధర్, ఏపీఎం శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బస్వయ్యగౌడ్, కొత్తగట్టు దేవస్థానం చైర్మన్ కోరెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాంపెల్లి తిరుపతి, పార్టీ నాయకులు బండారు తిరుపతి, గట్టు తిరుపతి, కవ్వ పద్మ, సిహెచ్ పద్మ, మొలంగూరి సదానందం, ఆడెపు అజయ్, చందు,రాజయ్య తదితరులు పాల్గొన్నారు
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్,కళ్యాణలక్ష్మిలబ్ధిదారులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెక్కులు పంపిణీ చేశారు. శనివారం శంకరపట్నం మండల కేంద్రంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శంకరపట్నం మండలానికి 21వ విడతలో 25 మందికి 6 లక్షల99 వేల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు కాగా , వాటిని ఇప్పుడు చెక్కుల రూపంలో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

