 
                * శవలగదిలో రోగి
* ఆధార్ లేదని.. అందించని వైద్యం
* మహబూబాద్ దవాఖానలో దారుణం
* ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : అచేతన స్థితిలో ఉన్నాడు.. మోకాళ్ల నొప్పులు..మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుందామని.. వచ్చాడు. తీరా.. అక్కడకు వెళ్లే సరికి ఆధార్ కార్డును చూపించమన్నారు. తనవద్ద లేకపోవడంతో బిక్కమోహం వేశాడు. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన వైద్యం అందించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయినా.. ప్రభుత్వ వైద్యులు కనికరించలేదు. ఆధార్ లేదని వైద్యం అందించలేదు. దీంతో చేసేదీ లేక.. ఆసుపత్రి క్యాంటీన్లో కాలం వెళ్లదీశాడు. అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
కుటుంబానికి దూరమై.. బతుకు భారమై..
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోని జయ్యారం గ్రామానికి చెందిన వెల్ది రాజు ఏడాది క్రితం ట్రాక్టర్‌పై నుంచి పడ్డాడు. దీంతో కాలుకు దెబ్బతగిలింది. తల్లిదండ్రులు లేకపోవడం, భార్యాపిల్లలు వదిలి వెళ్లడంతో ఒక్కడే ఇంటి వద్ద ఉంటున్నాడు. వారం రోజుల కిత్రం కాలు నొప్పి ఉందని, చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాడు. ఓపీ కౌంటర్ వద్దకు వెళ్లి ఎముకల డాక్టర్‌కు చూపించుకోవాలి.. చిట్టీ ఇవ్వాలని అడిగితే.. ఆధార్ కార్డుతోపాటు తోడుగా ఎవరైనా ఉంటేనే ఓపీ చిట్టీ ఇస్తామని చెప్పి పంపించారు. దీంతో చేసేదే ఏమీ లేక ఆసుపత్రి క్యాంటీన్లో ఉండిపోయాడు.
అచేతన స్థితిలో.. శవాల గదిలో..
ఆసుపత్రి క్యాంటీన్లో పడిపోయిన రాజును సిబ్బంది ఓపీ విభాగానికి తీసుకెళ్లారు. డాక్టర్ బుధవారం రాత్రి పరీక్షించి చనిపోయాడని నిర్ధారించడంతో రాజును మార్చురీ గదికి తీసుకెళ్లి బయట తాళం వేసి వచ్చారు. గురువారం ఉదయం మహిళా స్వీపర్ మార్చురీ గదిని శుభ్రం చేస్తుండగా, రాజు చేతులతో దగ్గరికి రావాలని సైగ చేశాడు. దీంతో ఆందోళన చెందిన స్వీపర్ భయంతో పరుగులు తీసి డాక్టర్లకు సమాచారం అందించింది. వెంటనే డాక్టర్లు, సిబ్బంది మార్చురీ గదికి వెళ్లి స్ట్రెక్చర్‌పై ఉన్న రాజును ఐసీయూకి తరలించి వైద్యం అందించారు. రాజు కోలుకోవడంతో జనరల్ వార్డుకు పంపించారు. ప్రస్తుతం రాజు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
…………………………………………..

 
                     
                     
                    