Mulugu Collector Bokkhade Hemant Sahadeva Rao
* గ్రామీణ ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలి
* కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్, ములుగు : స్థానిక సమస్యలకు పరిష్కారం చూపే నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
గురువారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* యువతలోని సృజనాత్మకతను వెలికితీయాలి..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి ఆవిష్కరణలే రేపటి భవిష్యత్తుకు పునాదులని అన్నారు. గ్రామీణ ప్రజలు తమ అనుభవాల ఆధారంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను గుర్తించేలా ప్రోత్సహించాలని సూచించారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, చేతివృత్తిదారుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలన్నారు.
ఆవిష్కరణలు పెద్ద పరిశోధనా కేంద్రాలకే పరిమితం కావని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లోనూ కొత్తగా ఆలోచించే ప్రతిభ ఉంటుందని తెలిపారు. వ్యవసాయం, నీటి పొదుపు, పారిశుద్ధ్యం, చేతివృత్తులు, రోజువారీ పనులను సులభతరం చేసే వినూత్న ఆలోచనలను గుర్తించాలని సూచించారు.
* గ్రామస్థాయిలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’పై అవగాహన..
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లోని ఆవిష్కర్తలను గుర్తించడంలో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు చొరవ చూపాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు తమ పరిసరాల్లోని సమస్యలను పరిశీలించి, వాటికి పరిష్కారాలను ఆలోచించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి సోహెల్, టీ-హబ్ ప్రతినిధి అమృత, ఈవై ప్రాజెక్ట్ లీడ్ అన్నీ విజయ్, డీఐసీ సిద్ధార్థ రెడ్డి, గ్రాస్రూట్స్ లీడ్ రమేష్ పాల్గొన్నారు. స్థానిక సమస్యలకు పరిష్కారాలను ప్రోత్సహించడం, వినూత్న ఆలోచనలకు మార్గదర్శకత్వం అందించడం వంటి అంశాలపై చర్చించారు.
జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, ఈడీఎం దేవేందర్, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

