
* గవర్నర్‌ను కోరిన ఫడ్నవీస్ బృందం
ఆకేరున్యూస్, ముంబై: మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి 11 రోజులైనా సీఎం ఎంపికపై పీటముడి వీడకపోవడంతో సస్పెన్స్ కొనసాగింది. చివరకు సీఎం ఎంపికపై మహాయుతి కూటమిలోని మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై దేవేంద్ర ఫడ్నవీస్‌ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నవీస్.. కూటమిలోని శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్‌లతో కలిసి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని కోరారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం ఉందన్నారు. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు సాయంత్రం దక్షిణ ముంబైలోని అజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరుకానున్నారు.
…………………………………………