* వానొస్తే.. హైదరాబాద్ వణకాల్సిందేనా?
* అరగంట వానకే అతలాకుతలమైన సందర్భాలెన్నో..
* ఈ నెలలోనూ రెండు సార్లు ఆగమాగం
* ఇక అసలైన వర్షాలు ప్రారంభమైతే..?
* ఏటా ఎందుకీ దుస్థితి
* చెరువులు, కుంటల కబ్జాలే కారణమా?
* కబ్జాలను తొలగించడం సాధ్యమేనా?
* పరిస్థితులను చక్కదిద్దాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి
* చారిత్రక నగరానికి సరైన ప్రణాళికలే లేవా?
‘‘ఈ ఏడాది మే 31 నుంచే తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి’’.. వాతావరణ శాఖ ఇటీవల చేసిన ఈ ప్రకటన తెలంగాణ ప్రజలందరికీ చల్లటి కబురు. హైదరాబాద్‌వాసులకు మాత్రం పిడుగులాంటి వార్త. ఎందుకంటే.. అరగంట గట్టిగా వర్షం కురిస్తే చాలు.. నగరం ఆగమాగం అవుతుంది. రహదారులు గోదారులు అవుతాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లే చెరువులు అవుతాయి. రోడ్లపై వాహనాలు బారులు తీరతాయి. ప్రాణ, ఆస్తినష్టం జరిగిన సందర్బాలూ ఉన్నాయి. పేరుకే మహా నగరం.. వర్షం వస్తోందంటే.. చిగురుటాకులా వణికిపోతుంది. ఈనెల 7న కురిసిన అకాలవానకే చాలాప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విశ్వ నగరంగా ఖ్యాతి పొందిన రాజధానిలో ఎందుకీ దుస్థితి..? వానొస్తే ఏటా మునగాల్సిందేనా? భారీ వర్షం కురిస్తే తట్టుకునేందుకు హైదరాబాద్ యంత్రాంగం సమాయత్తంగా ఉందా? అనే అంశాలపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
ఆకేరు న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్ :
మే నెలలో వర్షాలు అరుదుగా కురుస్తుంటాయి. ఒకవేళ పడినా అక్కడక్కడ చిరుజల్లులు పడుతుంటాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగా రెండు, మూడు సెంటీమీటర్లు నమోదవుతుంటాయి. అయితే ఈనెల 7న నగరంలో కుంభవృష్టి కురిసింది. తొలి అరగంట వానకే నగరం అతలాకుతలమైంది. నిమిషాల వ్యవధిలో రోడ్లపై వరద పొంగి పొర్లింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలు కాలనీలు నీళ్లతో నిండిపోయాయి. పలు ఇళ్లు చెరువులుగా మారిపోయాయి. ఇక ఐటీ కారిడార్ లాంటి ప్రాంతాల్లో రోడ్లపై వాహనం కిలోమీటరు ముందుకు కదిలేందుకు సుమారు 40 నిమిషాలపైనే పట్టింది. నగరజీవనం పూర్తిగా స్తంభించింది. గోడకూలడం, నాలాలో కొట్టుకుపోవడం తదితర కారణాలతో 11 మంది చనిపోయారు. అయితే సరిగ్గా 8 రోజుల తర్వాత నగరంలో మళ్లీ భారీ వర్షం కురిసింది. ప్రాణనష్టం లేదు కానీ.. అవే అవస్థలు నెలకొన్నాయి. ప్రధానంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్తున్న సమయంలో కురిసిన భారీ వర్షంతో ఉద్యోగులు నరకయాతన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం (మే 19) ఆకాశం మేఘావృతం కావడంతో మరోసారి భారీ వర్షం కురుస్తుందని నగరవాసులు భయపడ్డారు. వీకెండ్ బయటకు వెళ్దామనుకున్నవారు చాలా మంది ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
మేఘావృతమైతేనే భయపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..
వేసవిలో భయంకరమైన ఉక్కబోతతో అల్లాడిన నగరవాసులు.. ఆకాశం మేఘావృతమై, వాతావరణం చల్లబడితే సంతోషించాలి. కానీ సంతోషించేలోపే.. ఈనెల 7న కురిసిన భారీవాన తెచ్చిన తంటాలు వారిని ముప్పుతిప్పలు పెట్టాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నగరంలో వర్షం వచ్చినప్పుడల్లా అవే పరిస్థితులు ఉంటాయి. ఎటుచూసినా వరద, మురుగునీటి పరవళ్లే కనిపిస్తాయి. 2020 నుంచి పరిశీలిస్తే.. నగరంలో వరద, ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. కుంటలు మాయం కావడం, కాలువలు, నాలాలకు అడ్డంగా నిర్మాణాలు రావడం, అస్తవ్యస్తంగా రోడ్ల నిర్మాణం, అక్రమ కట్టడాల కారణంగా వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వరద రోడ్లపైన, కాలనీలు, బస్తీలు.. ఇలా ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో వర్షం వస్తోందంటేనే.. హైదరాబాద్ నగరవాసులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ దురావస్థకు కారణాలు ఇవే..
ఒకప్పుడు వర్షపు నీరు గొలుసుకట్టు ద్వారా చిన్న చెరువు నుంచి పెద్ద చెరువుకు, ఆ తర్వాత అలుగు నుంచి వాగుల ద్వారా మూసీనదిలోకి చేరే సహజ నీటి పరివాహక వ్యవస్థ ఉండేది. అలాగే ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని పైపులతో కూడిన వ్యవస్థ ద్వారా మూసీనదిలోకి పంపేవారు. నగరం కేవలం 53 చదరపు కిలోమీటర్ల ఉన్నప్పుడు, జనాభా తక్కువ ఉన్నప్పుడు, అపార్టమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు లేనప్పుడు ఈ మురుగునీటిని ఇముడ్చుకునే సామర్థ్యం మూసీనదికి ఉండేది. జనాభా, అపార్టమెంట్ కల్చర్ పెరిగి, నగరం మహా నగరంగా మారింది. 250 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. విస్తరిత ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీటిని ఇముడ్చుకోవడానికి మూసీకి సామర్థ్యం సరిపోవడం లేదు. పైగా నాడు ఉన్న చెరువులు, కాలవలు మాయం అయ్యాయి. ఫలితంగా వర్షం పడితే వరద, మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. దీనికితోడు.. మహా నగరంలో నీటి సరఫరా పెరుగుతోంది. హైదరాబాద్ జలమండలి రోజూ సుమారుగా 176 కోట్ల లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తోంది. వాటికి తోడు భూగర్భజలాలు కలుపుకుని నగరవాసులు ఉపయోగించిన తర్వాత దాదాపు 200 కోట్ల లీటర్ల మురుగునీరు నగరంలో పారుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ స్థాయిలో నీరు పారేలా అవసరమైన పైపులైను వ్యవస్థ లేదు. కాలువలు లేవు.
ఆక్రమణలు వేలాదిగా ఉండడంతో వెనుకడుగు
ఆగస్టు 23, 2000 సంవత్సరంలో మూసీనదిలో వరదలు వచ్చినప్పుడు నగరంలోని మురుగునీటి వ్యవస్థ అధ్యయనం చేసి, బాగు చేయడానికి సరైన ప్రణాళికలు ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వం కిర్లోస్కర్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చింది. మూడేళ్లపాటు కిర్లోస్కర్ కమిటీ అధ్యయనం చేసి సర్కారుకు ఓ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత వోయంట్ అనే మరో సంస్థ నుంచి కూడా నివేదిక అందుకున్నారు. 2020 తర్వాత కూడా మరొకరికి అధ్యయనం కోసం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ నివేదికల ప్రకారం.. డ్రైనేజీ వ్యవస్థను రీడిజైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం వేలాదిగా ఆక్రమణలకు గురైన చెరువులను, నాలాలపై అక్రమంగా నిర్మించిన వేలాది కట్టడాలను తొలగించాలి. లోపభూయిష్టమైన ప్రణాళికలతో నిర్మించుకుంటూ పోయిన నగరాన్ని సరిచేసుకుంటూ రావాలి. అది అంత ఈజీ కాదు. ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి. లక్షలాది మంది ప్రజాజీవితంపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఆ సాహసం చేయలేకపోతున్నాయి. ఈక్రమంలో తాత్కాలిక చర్యలు తప్ప, సమస్య శాశ్వత పరిష్కారానికి ముందడుగు పడడం లేదు.
మరి పరిష్కారం ఎలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
ప్రణాళికారహిత అభివృద్ధి వల్లే ఈ ఇబ్బందులు అని స్పష్టం అవుతోంది. అయితే, ఉన్నంతలో పరిస్థితిని మెరుగుపర్చే అంశాన్ని అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కొన్ని అంశాలను మెరుగుపరుచుకుంటే వర్షం ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
– నగరంలో నాలాలు, వరద నీటి కాలువల సామర్థ్యం కేవలం రెండు సెంటి మీటర్లు. ఈ బాధలు తప్పాలంటే కనీసం 30 నుంచి 40 సెం.మీల వర్షపాతం తట్టుకునేలా నాలాలు, వరద నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
– ఆక్రమణల తొలగింపు సవాల్‌తో కూడుకున్నది కాబట్టి, మధ్యే మార్గంగా ఎక్కువ ఆస్తుల సేకరణ అవసరం లేని ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్లు, రహదారుల వద్ద కల్వర్టులు, పైపులైన్ల స్థానంలో వాటి సామర్థ్యం పెంచుతూ బాక్స్ డ్రైన్లు నిర్మించాలి.
– బీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఎన్డీపీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రస్తుత పైపులైను వ్యవస్థను రీస్టోర్ చేయాలి. అవకాశాన్ని బట్టి కొంచెం.. కొంచెం.. మార్చుకుంటూ పోవాలి.
– వీలైనన్ని ప్రాంతాల్లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్లను నిర్మించాలి.
– భాగ్యనగరంలో మురుగు నీటి వరద నివారణకు జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి సమన్వయంగా కార్యాచరణ రూపొందించాలి.
– డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్), తక్షణ మరమ్మతు బృందా(ఐఆర్టీ)లను పెంచాలి.
– హైదరాబాద్ నగర మురుగునీటి వ్యవస్థను బాగు చేయాలంటే కనీసం పది వేల కోట్ల రూపాయలు అవసరమని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. అధ్యయనాలను బట్టి చెప్పారో, నోటిమాటగా చెప్పారో తెలియదు కానీ.., అంత అంచనా వేశారంటే మురునీటి వ్యవస్థ ఎంతలా అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడా వ్యవస్థను చక్కదిద్దాలంటే నిధులు సమకూర్చడం అత్యవసరం.
భారీ వర్షం వస్తే ఈ ప్రాంతాలు మునగడం పక్కా..
– కృష్ణానగర్
– మన్సూరాబాద్ డివిజన్లోని సాయినాథ్ కాలనీ
– వినాయక్‌నగర్ డివిజన్
– వనస్థలిపురం చింతలకుంట పరిధిలోని విజయవాడ జాతీయ రహదారి
– అంబర్‌పేట్‌లోని ప్రేమ్‌నగర్, జిందాతిలిస్మాత్ రోడ్డు
– గౌతంనగర్ డివిజన్లోని వెంకట్రాదినగర్ కాలనీ
– దిల్సుఖ్నగర్ పరిధిలోని జవహర్‌నగర్
– మలక్‌పేట ప్రధాన రహదారి
– వీఎస్టీ మార్గం
– కుత్బుల్లాపూర్, నిజాంపేట్, జీడిమెట్ల
– అమీర్‌పేట్, బేగంపేట్, సనత్‌నగర్
– పంజాగుట్ట మోడల్ హౌస్ వద్ద
– వీఎస్టీ చౌరస్తా
– మూసాపేట జోన్
– మెహిదీపట్నం, కార్వాన్ సర్కిళ్లలోని కొన్ని ప్రాంతాలు
– జూబ్లీహిల్స్ రోడ్ 70లోని కొంత భాగం
– కూకట్ పల్లిలోని రాందేవ్ బాబా ఆస్పత్రి పరిసరాల్లోని జాతీయ రహదారి
– మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఇరువైపులా..
————————-