
* అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు
* వీసీ ప్రొఫెసర్ రమేశ్ పై విజిలెన్స్ అధికారుల నిఘా ..?
* విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న పార్ట్ టైమ్ లెక్చరర్ల ఆందోళన
* విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించాడు – అకుట్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ ఇస్తారి
ఆకేరు న్యూస్ , హనుమకొండ : ఎట్టకేలకు కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ( Tatikonda Ramesh ) అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (Vigilance and Enforcement department ) విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చాన్స్‌లర్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ప్రొఫెసర్ రమేశ్ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాడు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక అక్రమాలకు తెరలేపాడని విశ్వవిద్యాలయ అద్యాపక సంఘం అకుట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ బోధన, బోధనేతర సిబ్బందిని ఇబ్బందులకు గురి చేశాడని చెబుతున్నారు. పదవీ కాలం ముగిసిపోవడానికి కేవలం మూడు రోజుల మాత్రమే ఉన్నప్పటికీ బదిలీల పరంపర కొనసాగించాడంటున్నారు. పదవీ విరమణకు ముందు ఇలాంటి పనులకు పాల్పడకూడదని తెలిసినప్పటికీ తనకు ఏం కాదన్న ధీమాతో అక్రమాలు కొనసాగించాడంటున్నారు.
* వీసీ ప్రొఫెసర్ రమేశ్ పై విజిలెన్స్ అధికారుల నిఘా ..?
ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందించలేదంటున్నారు. దీంతో తమ దైన పద్దతుల్లో ఆరా తీయడంతో విశ్వవిద్యాలయంలోనే ఒక విభాగంలోనే ఉన్నాడని తెలియడంతో అక్కడకు వెళ్ళి అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. కొంత సేపు విచారించి తమకు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్టు సమాచారం . వీసీ ఇంటి వద్ద పోలీసుల నిఘా ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. ఆదివారం వైస్ చాన్స్‌లర్ రమేశ్ పై వచ్చిన ఆరోపణలకు సంబందించి పూర్తి స్థాయి సమాచారం తీసుకుంటారని తెలిసింది. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు ధృవీకరించలేదు.
* విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించాడు
ప్రొఫెసర్ ఇస్తారి, అకుట్ , ప్రధానకార్యదర్శి
కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రొఫెసర్ రమేశ్ భ్రష్టు పట్టించాడు. పదేళ్ళ వెనకకు తీసుకెళ్ళాడు. నిబంధనలకు విరుద్దంగా అద్యాపకులు, సిబ్బందిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డాడు. వీసీ రమేశ్ అక్రమాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏనాడు స్పందించలేదు. ఇప్పటికైనా వీసీ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
* కొనసాగుతున్న పార్ట్ టైం లెక్చరర్ల ఆందోళన
మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న కేయూ పార్ట్ టైం లెక్చరర్ల ఆందోళన శనివారం కూడా కొనసాగింది. తమను కాంట్రాక్చువల్ లెక్చరర్స్ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. రిజిష్ట్రార్ చాంబర్లోనే ఉండి ఆందోళన కొనసాగిస్తున్నారు.
———————————–