* నరేందర్ రెడ్డి అరెస్టు తీరుపై హైకోర్టు ప్రశ్న
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తుండగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి(brs ex mla narender reddy)ని అరెస్టు చేయడాన్ని హైకోర్టు(high court) తప్పుబట్టింది. ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందో వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది. అరెస్ట్ చేసే క్రమంల్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోలేదని ఆక్షేపించింది. లగచర్ల (lagacharla) దాడి ఘటనలో తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ తనపై పెట్టిన కేసులను క్వాష్ చేయాలని నరేందర్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. కాల్స్ చేసినందుకు అరెస్ట్ చేయడం సరికాదని, కనీసం అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని తెలిపారు. సుప్రీం తీర్పులు కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్ట్ గ్రౌండ్స్ చూడకుండానే నరేందర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని న్యాయవాది తెలిపారు.
అలాగే కోర్టును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, నచ్చింది రాసుకుని కన్ఫెషన్ రిపోర్టుగా చూపిస్తున్నారని వాదించారు. ఈ క్రమంలోనే కోర్టు కూడా పోలీసులకు కీలక ప్రశ్నలు సంధించింది. లగచర్ల ఘటన జరిగిన రోజు సురేష్(suresh)తో నరేంద్ర ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారా?, ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా..? ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటి..? పార్క్‌లో వాకింగ్ చేస్తున్న నరేందర్‌ను ఏ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు? అతడు ఏమైనా టెర్రరిస్టా..? అంటూ ప్రశ్నలు సంధించింది. అందుకు బదులిస్తూ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ,. ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి లేకున్నా నిందితులకు ఆయనే డబ్బు సమకూర్చారని అన్నారు. దాడికి పరోక్షంగా ప్రేరేపించారని వాదించారు. అలాగే నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని, ఆయన ఇంటి ముందు అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇరువాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
…………………………………