
* అధికారులతో సమీక్షించిన సీఎస్ శాంతికుమారి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా, ఇసుక అక్రమాల నిరోధంపై సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. రాష్ట్రంలో ఇసుక లబ్దిని సవిూక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం తెలంగాణ సచివాలయంలో మైనింగ్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో సి.ఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సరిపడ ఇసుక అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆమె కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డులను భౌతికంగా తనిఖీ చేయాలని కలెక్టర్లకు ఆమె సూచించారు. అధికారులు స్టాక్‌యార్డులు, ఇసుక రీచ్‌ల ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లతో పాటు అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలను కూడా తనిఖీ చేయాలన్నారు. ªూష్ట్రంలోని ప్రధాన ఇసుక మార్కెట్లకు వెళ్లే రహదారులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. పోలీసు, రవాణా శాఖ అధికారులతో రోడ్డు పెట్రోలింగ్ లు నిర్వహించాలని, తనిఖీల కోసం సంబంధిత శాఖలతో జాయింట్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. రీచ్‌లు, స్టాక్‌యార్డుల నుండి అనధికారికంగా ఇసుకను తరలించకుండా 24 గంటలు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఏమాత్రం అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. డిజిపి జితేందర్, ఇంటెలిజెన్స్ డిజి బి.శివధర్ రెడ్డి, ఎడిజిపి మహేష్ భగవత్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్, డిఎంజి శశాంక, టిజిఎండిసి ఎండి సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
……………………………