Bandi Sanjay Kumar
* ప్రయాణికుల సౌకర్యాలపై బండి సంజయ్ ప్రత్యేక దృష్టి
ఆకేరు న్యూస్, హుజురాబాద్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల రూపురేఖలు త్వరలో మారనున్నాయి. ఈ రెండు స్టేషన్ల ఆధునీకరణ ప్రతిపాదనలను నెల రోజుల్లోగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా బుధవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జమ్మికుంట రైల్వే స్టేషన్లో ప్రజల చిరకాల వాంఛ అయిన రోడ్డు కింద వంతెన (Road Under Bridge – RUB) నిర్మాణంతో పాటు, సరుకుల రవాణాకు సంబంధించి వ్యాగన్లలో సరుకుల లోడింగ్, అన్లోడింగ్ (Wagon Loading and Unloading) సౌకర్యాలు కల్పించే అంశంపై చర్చించారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినట్లు బండి సంజయ్ తెలిపారు.
ఉప్పల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ కౌంటర్ (Reservation Counter) ఇప్పటికే ట్రయల్ రన్లో ఉందని, త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. జమ్మికుంటతో పాటు పెద్దపల్లి రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు అదనపు హాల్టులు (Additional Train Halts) కల్పించాలని అధికారులను కోరారు.
రైల్వే ప్రాజెక్టులకు గడువులు
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిపైనా సమీక్షించారు. సిరిసిల్ల వరకు రైల్వే మార్గాన్ని 2026 డిసెంబర్ నాటికి, వేములవాడ వరకు 2027 జూన్ నాటికి, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గాన్ని 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కొండగట్టులో కొత్త రైల్వే స్టేషన్?
కొండగట్టులో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను బండి సంజయ్ కోరారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం (Feasibility Study) చేపట్టాలని సూచించారు.
రైళ్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి
కరీంనగర్ నుంచి తిరుపతికి నడిచే రైలును వారానికి మూడు లేదా నాలుగు రోజులు నడిపించాలని, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం వారానికి రెండు ప్రత్యేక రైళ్లు (Special Trains) ఏర్పాటు చేయాలని కోరారు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను (Basic Amenities) మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో పెండింగ్లో ఉన్న రైల్వే పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

