చేపల పెంపకంపై మత్స్యకార రైతులకు ప్రత్యేక శిక్షణ
* తక్కువ ఖర్చుతో అధిక లాభాలపై అవగాహన!
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: మత్స్యకారులు చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులను అవలంబించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పలువురు అధికారులు, నాయకులు సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రైతు వేదికలో ముర్రెల్ (కొర్రమీను) చేపల పెంపకంపై మత్స్యకార రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన (PMDDKY) కింద తెలంగాణ ప్రభుత్వం, మత్స్యశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా జనగామ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ నీల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. మత్స్యకార రైతులకు ఉపయోగపడేలా కొర్రమీను చేపల పెంపకంపై శిక్షణ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆక్వాకల్చర్ శాస్త్రవేత్త గణేష్ అందించే సలహాలు, సూచనలను పాటించి మత్స్యకారులు చేపల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
శిక్షణలో భాగంగా ఆక్వాకల్చర్ శాస్త్రవేత్త గణేష్ మాట్లాడుతూ.. కొర్రమీను చేపల పెంపకాన్ని సరైన యాజమాన్య పద్ధతులతో చేపడితే తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం పొందవచ్చని వివరించారు. చెరువులు, కుంటల్లో చేపల పెంపకం విధానం, చేపలకు అందించాల్సిన ఆహారం, నీటి నాణ్యత నిర్వహణ, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న మత్స్యశాఖ పథకాలు, సబ్సిడీలు, రుణ సౌకర్యాల గురించి వివరించారు. రైతులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన కార్యదర్శి గోరంట్ల యాదగిరి, మండల పరిధిలోని వివిధ గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా మత్స్యకార సంఘాల సభ్యులు, పరిసర గ్రామాల మత్స్యకారులు, రైతులు, మత్స్యశాఖ సిబ్బంది సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

