
అమెరికా కోర్టులో తెలుగు జడ్జి.. తొలిసారిగా నియమితులైన జయబాదిగ
* తొలిసారిగా నియమితులైన జయబాదిగ
* మచిలీపట్నం మాజీ ఎంపీ కుమార్తెకు అరుదైన గౌరవం
ఆకేరు న్యూస్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో చాలా మంది తెలుగువారు ఇప్పటికే పలు రంగాల్లో సత్తా చాటుతున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఎక్కువగా స్థిరపడుతున్నారు. అందుకు విరుద్ధంగా ఓ తెలుగు మహిళ అమెరికాలో అరుదైన గౌరవం పొందారు. అత్యున్నత స్థానంలో నిలిచారు. అమెరికా కాలిఫోర్నియాలోని సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు. 2022 నుండి ఆమె ఇదే కోర్టులో కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కాలిఫోర్నియాలో జడ్జిగా అపాయింటైన వారిలో జయబాదిగా మొదటివారు.
విజయవాడ స్వస్థలం
జయబాదిగా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ. చిన్నతనంలో విజయవాడలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. 1991 నుండి 1994 లో హైద్రాబాద్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1991-1994 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్ సైన్సు సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం ఆమె అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ, శాంటాక్లారా యూనివర్శిటీలో లా పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ పరీక్షను జయ బాదిగ పూర్తి చేశారు. పదేళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2022 నుండి శాక్రమెంటో సుపీరియర్ కోర్టు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియాలో కుటుంబ న్యాయ సలహాల రంగంలో నిపుణురాలిగా గుర్తింపు పొందారు.
ఆమె తల్లిదండులు ఎవరంటే..
ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బి.రామకృష్ణ, ప్రేమలత దంపతుల కుమార్తె జయ బాదిగ. జయ తండ్రి రామకృష్ణ 2004 నుండి 2009 వరకు మచిలీపట్టణం ఎంపీగా పనిచేశారు. రామకృష్ణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఒక కొడుకు. రామకృష్ణ మూడో కూతురే జయ. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటారు.
——————–